ఆస్ట్రేలియా, యూఏఈలతో వ్యాపారాభివృద్ధి

Ensure quality power supply at reasonable rates to industries - Sakshi

దేశీయ పరిశ్రమకు ఆర్థికమంత్రి పిలుపు

అందుకు భాగస్వాములను ఎంచుకోవాలని సూచన

ఎఫ్‌టీఏ అవకాశాలను సద్వినియోగానికి విజ్ఞప్తి  

చెన్నై: ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ)లతో భారత్‌ కుదుర్చుకున్న స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా ఒనగూడే వాణిజ్య అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశీయ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో భాగస్వాములను గుర్తించాలని కూడా పిలుపునిచ్చారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఇక్కడ నిర్వహించిన ‘స్టేక్‌హోల్డర్స్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌’లో సీతారామన్‌ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), ఆస్ట్రేలియాతో ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందంపై భారత్‌ సంతకాలు చేయడంతో, ఇప్పుడు ఆ రెండు దేశాలలో ‘‘తమ జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి‘ని గుర్తించడం పరిశ్రమలకు కీలకం. ఇది ఆయా దేశాల్లో వ్యాపారావకాశాలను పెంచుతుంది. యూఏఈలో వ్యాపారవేత్తలు భారత్‌లో 75 బిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సింద్ధంగా ఉన్నారు.  
► ఆరేడేళ్ల క్రితం తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు, భారతదేశం ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో ముందడుగు వేయాలని పలు సూచనలు వచ్చాయి. ఈ రోజు భారత్‌ యూఏఈ, ఆస్ట్రేలియాతో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది.  
► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఆస్ట్రేలియాతో 10 ఏళ్లకు పైగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఒప్పందం కేవలం 88 రోజుల్లోనే కుదరడం భారత్‌ ప్రభుత్వం ఈ విషయంలో సాధించిన పురోగతికి నిదర్శనం. ఇండో–పసిఫిక్‌ స్ట్రాటజిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ఆస్ట్రేలియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  
► కంపెనీ లేదా ఇతర ఏదైనా సంస్థ తన కార్యకలాపాలలో పారదర్శకంగా ఉండాలి. కంపెనీలోని పెట్టుబడిదారులుసహా అన్ని వివరాలు ‘‘పబ్లిక్‌ డొమైన్‌’’లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలే పరిశ్రమ కార్యకలాపాలకు సంబంధించి పారదర్శకతను పెంపొందిస్తాయి.  
► కేంద్రం పరిశ్రమకు తన పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పన్ను విధానాల్లో ప్రభుత్వం సూచించిన పారదర్శక పద్దతులు పాటిస్తూ, పన్నులు చెల్లిస్తే  ఎటువంటి తనిఖీలూ ఉండవు.  
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున భారత్‌ పరిశ్రమ ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తగిన అన్ని చర్యలూ తీసుకోవాలి. పరిశ్రమకు ఇది చాలా కీలకం.  
► చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చారు.  ఈ సమావేశానికి చాలా ఆసక్తితో హాజరు కావడానికి సమయం తీసుకున్నారు. మనం మన కార్యకలాపాలలో పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను పెంచడం వంటి చర్యల ద్వారా వ్యాపారాన్ని వేగంగా వృద్ధిబాటన నడపగలుగుతాము.  
► కంపెనీలు ఇతర దేశాలలో వ్యాపార సంబంధాలు నెరపడానికి గతంలో పలు అవరోధాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఎటువంటి అవరోధాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

పరిశ్రమకు విద్యుత్‌ కష్టాలు రానీయకండి...రాష్ట్రాలకు సూచన
కాగా, పరిశ్రమలకు విద్యుత్‌ కష్ట నష్టాలు రానీయద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికమంత్రి విజ్ఞప్తి చేశారు. తగిన రేట్లకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలు చేయాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటలై 365 రోజులు పరిశ్రమకు విద్యుత్‌ అందేలా చర్యలు ఉండాలన్నారు. ఇందుకు తగిన మౌలిక ఇంధన ప్రణాళికను రూపొందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పురోగతికి ఇది కీలకమని పిలుపునిచ్చారు.

ఈ దిశలో రాష్ట్రాలకు కేంద్రం తగిన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తుందని భరోసాను ఇచ్చారు. దేశ మౌలిక రంగం పురోగతికి 2021–22 బడ్జెట్‌తో పోల్చితే 2022–23 బడ్జెట్‌లో నిధుల కల్పనను రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం 50 ఏళ్లపాటు రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాన్ని అందజేస్తామని బడ్జెట్‌లో ప్రకటించామనీ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top