స్టార్టప్స్‌కు ద్వారక కో-వర్కింగ్‌ స్పేస్‌ | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌కు ద్వారక కో-వర్కింగ్‌ స్పేస్‌

Published Tue, Dec 6 2022 1:15 AM

Dwaraka Opens Co Working Space For Startups In Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆఫీస్‌ స్పేస్‌ కంపెనీ ద్వారక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. స్టార్టప్స్‌ కోసం ప్రత్యేకంగా 620 సీట్లతో మాదాపూర్‌లో ద్వారక ప్రైడ్‌ను ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలకుగాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ ఆర్‌.ఎస్‌.ప్రదీప్‌ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు.

కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి జోడిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ డైరెక్టర్‌ దీప్నా రెడ్డి వివరించారు.  

అనువైన విధానం..: ఆఫీస్‌ స్పేస్‌ పరిశ్రమలో ప్లగ్‌ అండ్‌ ప్లే, కో–వర్కింగ్, సర్వీస్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ విభాగాల్లో పోటీ పడుతున్నామని దీప్నా రెడ్డి   తెలిపారు. ‘ఐటీ రంగంలో ఒడిదుడుకులు సహజం. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం.

అంటే ఒప్పందం కుదుర్చుకుని సీట్లను తగ్గించుకున్నా వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు చార్జీల్లో డిస్కౌంట్‌ ఇస్తున్నాం. మహమ్మారి కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ పరిశ్రమ తిరోగమించింది. ఇదే కాలంలో ద్వారక ఇన్‌ఫ్రా భారీ ప్రాజెక్టులకుతోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. సాధారణ చార్జీలతోనే ప్రీమియం ఇంటీరియర్స్‌తో ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నాం’ అని వివరించారు.

Advertisement
Advertisement