అంబానీ.. అదానీ.. సౌదీ ఆరామ్‌కో.. అనేక మలుపులు

Details About Reliance Adani Saudi Aramco Deals - Sakshi

దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నులైన ఇద్దరు వ్యక్తులైన ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఎనర్జీ సెక్టార్‌లోపై చేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఒకే దిశగా ఒకే మార్గంలో పరుగెడుతూ ఆసక్తికర పోటీకి తెర తీశారు.

గుజరాత్‌కి చెందిన ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల మధ్య విచిత్రమైన పోటీ నెలకొంది. గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా సోలార్‌ పవర్‌, హైడ్రోజన్‌ పవర్‌ ఉత్పత్తికి సంబంధించి ఒప్పందాల మీద ఒప్పందాలు చేసుకుంటూ ఎవరూ ముందు లక్ష్యాన్ని చేరుకుంటారా అనే ఆసక్తిని బిజినెస్‌ సర్కిల్స్‌లో లేవనెత్తారు. తాజాగా గౌతమ్‌ అదానీ తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చకు దారి తీసింది.

పెట్రోల్‌ ఉత్పత్తిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరామ్‌కో సంస్థ విషయంలో గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీలు భిన్నమైన మార్గాలను ఎంచుకున్నారు. రిలయన్స్‌, సౌదీ అరామ్‌కోలు సంయుక్తంగా ముడి చమురు ఉత్పత్తిలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు 2021 వార్షిక సర్వ సభ్య సమావేశంలో సౌదీ అరామ్‌కో ప్రతినిధులకు రిలయన్స్‌ బోర్డులో సభ్యత్వం కల్పించారు ముకేశ్‌ అంబానీ. అయితే మూడు నెలలు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. గ్రీన్‌ ఎనర్జీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నందున ముడి చమురు ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టు రిలయన్స్‌ ప్రకటించింది. దీంతో మూడేళ్ల పాటు సాగిన చర్చలకు పులిస్టాప్‌ పడింది.

రిలయన్స్‌తో చర్చలు విఫలమైన తర్వాత సౌదీ అరామ్‌కో సంస్థ 4 శాతం వాటాను పబ్లిక్‌ ఇన్వెస్ట్‌ ఫండ్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పబ్లిక్‌ ఇన్వెస్ట్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు గౌతమ్‌ అదానీ. ఈ మేరకు సౌదీ అరామ్‌కో సంస్థతో తొలి దశలు చర్చలు సైతం పూర్తి చేశారు. ఓవైపు ఫ్యూచర్‌ ఎనర్జీగా చెప్పుకుంటున్న సోలార్‌, హైడ్రోజన్‌ పవర్‌పై ఇన్వెస్ట్‌ చేస్తూనే మరోవైపు సంప్రదాయ ముడి చమురు సెక్టార్‌లోనూ బలంగా పాతుకుపోయేందుకు గౌతమ్‌ అదానీ ప్రయత్నిస్తున్నారు.

సౌదీ అరామ్‌కో డీల్‌ జరగకపోయినా రిలయన్స్‌కు పెద్దగా ఇబ్బంది లేదంటున్నారు మార్కెట్‌ నిపుణులు. కేజీ బేసిన్‌లో ఇప్పటికే రిలయన్స్‌కు ముడి చమురు ఉత్పత్తిలో ఉంది. కాబట్టే సౌదీ డీల్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకుందంటున్నారు. మరోవైపు వేదాంత అనిల్‌ అగర్వాల్‌ సైతం ముడి చమురు ఉత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ మేరకు కెయిర్న్‌ సంస్థతో కలిసి నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు.  

చదవండి: అంబానీ, అదానీలు అలా.. వేదాంత అనిల్‌ తీరు ఇలా..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top