ఫ్యూచర్‌ రిటైల్‌కు ఊరట!

Delhi High Court pronounces order in FRL appeal against status quo order - Sakshi

ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్‌

అమెజాన్‌కు అనుకూలంగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు డివిజనల్‌ బెంచ్‌ స్టే

ఎఫ్‌ఆర్‌ఎల్‌ అప్పీల్‌పై 26వ తేదీలోపు కౌంటర్‌కు అమెజాన్‌కు ఆదేశాలు

అటు తర్వాత కేసులో రోజూవారీ విచారణ జరుపుతామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఒప్పందానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి నేతృత్వంలోని బెంచ్‌ అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు  అనుకూలంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులకు అదే కోర్టు డివిజినల్‌ బెంచ్‌ సోమవారం స్టే ఇచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పాటిల్, జస్టిస్‌ జ్యోతి సింగ్‌లతో  కూడిన ధర్మాసనం కీలక రూలింగ్‌ ఇస్తూ, ఈ కేసులో పలు అంశాలకు సంబంధించి ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) అప్పీల్‌ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ఆయా అంశాలపై ఫిబ్రవరి 26వ తేదీలోపు తన వైఖరి ఏమిటో తెలియజేయాలని అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. అటు తర్వాత ఈ అంశంపై రోజూవారీ తన విచారణను చేపడతామని హామీ ఇచ్చింది.  ఈ విషయంలో ఉత్తర్వుల అమలుకు వారం గడువును ఇవ్వాలని, తద్వారా తదుపరి తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలను అన్వేషిస్తామని అమెజాన్‌ విజ్ఞప్తిని సైతం బెంచ్‌ త్రోసిపుచ్చింది.

కేసు వివరాలు ఇవీ...
ఫ్యూచర్‌ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్‌ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)లో ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌సీపీఎల్‌)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్‌ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కు కూడా ఎఫ్‌ఆర్‌ఎల్‌లో సాంకేతికంగా వాటాలు సంక్రమించినట్లయింది. ఫ్యూచర్‌ కూపన్స్‌తో డీల్‌ కుదుర్చుకున్నప్పుడే.. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్‌ చెబుతోంది.  ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ,  ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌– రిలయన్స్‌ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్‌ రిటైల్‌ను ఆదేశించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా...  జనవరి 21వ తేదీన  ఫ్యూచర్‌–రిలయన్స్‌ డీల్‌కు సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇటు షేర్‌హోల్డర్లతో పాటు అటు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోర్టుల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.  ఈ వ్యవహారంలో సీఈఓ కిశోర్‌ బియానీసహా ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

బియానీ కుటుంబ సభ్యుల ఆస్తులన్నింటినీ వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని. వాటిని జప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్‌ఐఎల్‌ కు ఫ్యూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌ ఆస్తుల విక్రయ ప్రక్రియను  వెంటనే నిలుపుచేయాలని  కోరింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు సెబీ, అలాగే స్టాక్‌ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు సంబంధించి తనకు అనుకూలంగా ఎస్‌ఐఏసీ  ఇచ్చిన మధ్యం తర ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జేఆర్‌ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ 2021 పిబ్రవరి 2న రూలింగ్‌ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌తో డీల్‌పై యథాథత స్థితిని పాటించాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఆదేశించింది. దీనిపై ఫ్యూచర్‌ అప్పీల్‌ను విచారించిన డివిజనల్‌ బెంచ్‌ తాజాగా ఫ్యూచర్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top