
లావాదేవీలు హవాలా నుంచి క్రిప్టో రూపంలోకి
ఏటా ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ‘పన్ను పోటు’
సాక్షి, సిటీబ్యూరో: ఆహార ఉత్పత్తులు, బంగారం, వెండి, ముడిచమురు తదితరాలకు సంబంధించిన కమోడిటీ ట్రేడింగ్‌కు సమాంతరంగా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ అక్రమార్కులు సాగించే ‘డబ్బా ట్రేడింగ్’ (Dabba trading ) ఇప్పుడు కొత్త పంథాలో సాగుతున్నట్లు నిఘా, ఆదాయపు పన్ను శాఖ వర్గాలు గుర్తించాయి. హవాలా, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగే ఈ అక్రమ వ్యవహారాల వెనుక మాఫియా హస్తం ఉన్నట్లూ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
క్రిప్టోతో పాటు హవాలా, నగదు రూపంలో లావాదేవీలు జరుగుతుండటంతో పెద్ద మొత్తంలో నల్లధనం మార్పిడి జరుగుతున్నట్లు తేల్చాయి. ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచాల్సిందిగా నిఘా, పోలీసు వర్గాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించి ఇటీవల నగరంలోని బంజారాహిల్స్, అబిడ్స్, కళాసీగూడల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.
అధికారికంగా షేర్ల క్రయవిక్రయాలు నిర్వహించడానికి స్టాక్ ఎక్సేంజ్‌లు ఉంటాయి. ఇదే రకంగా కమోడిటీస్‌కు సంబంధించిన లావాదేవీలు నెరపడానికి ప్రత్యేక ఎక్సేంజ్ వంటి వ్యవస్థ ఉంది. వీటిలో జరిగే లావాదేవీలన్నీ పాదర్శికంగా, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సాగుతుంటాయి. ప్రతి క్రయవిక్రయం పైనా ప్రభుత్వానికి నిర్దేశిత శాతం పన్ను కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సమాంతరంగా లావాదేవీలను అధికారికంగా ఎక్కడా నమోదు చేయకుండా నిర్వహించే లావాదేవీలనే డబ్బా ట్రేడింగ్ అంటారు.
ప్రస్తుతం బంగారం, వెండికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే ఈ డబ్బా ట్రేడింగ్ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృతంగా జరిగే ఈ వ్యవహారాలు అటు షేర్ మార్కెట్‌లోనూ, ఇటు కమోడిటీ మార్కెట్‌లోనూ జోరుగా సాగుతున్నాయి. లావాదేవీల రుసుం మిగుల్చుకోవడానికి నిర్వాహకులు, పన్ను భారం తప్పించుకోవడంతో పాటు నల్లధనంతో కూడిన లావాదేవీలను నెరపడానికి వినియోగదారులు వీటిని ప్రోత్సహిస్తున్నారు.
కమోడిటీస్ డబ్బా ట్రేడింగ్‌లో చక్కెర, ముడిచమురు, వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వెండి వంటి వస్తువులను ధర తక్కువగా ఉన్నప్పుడు కొని, డిమాండ్ వచ్చేదాకా వేచి ఉండి విక్రయిస్తుంటారు. సాధారణంగా షేర్లు, కమోడిటీస్‌కు సంబంధించిన క్రయ విక్రయాలన్నీ పక్కా పత్రాలతో కంప్యూటర్ల ఆధారంగా ఆన్‌లైన్‌లో జరుగుతుంటాయి. అతి తక్కువ సందర్భాల్లోనే మాత్రమే వాస్తవంగా వస్తుమార్పిడి జరుగుతుంది.
డబ్బా ట్రేడింగ్ మాత్రం బ్యాంకు లావాదేవీలు, డీ మ్యాట్ అకౌంట్లతో సంబంధం లేకుండా పూర్తి ఆఫ్‌లైన్‌లో జరిగిపోతుంది. ఏళ్లుగా హవాలా మార్గంలో సాగుతుండగా... ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ రూపంలోనూ జరుగుతున్నట్లు తేలింది. ఆదాయం భారీగా ఉండటంతో మాఫియా శక్తులు డబ్బా ట్రేడింగ్‌లో అడుగుపెట్టాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్, జార్జియాల్లోనూ ఈ డబ్బా ట్రేడింగ్ నెట్‌వర్క్ నడుస్తోందని అధికారులు గుర్తించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లతో పాటు మహారాష్ట్రలోని ముంబైల్లో మాఫియాలతో సంబంధాలున్న వ్యక్తులు వ్యవస్థీకృతంగా ఈ డబ్బా ట్రేడింగ్, హవాలా రూపంలో నగదు మారి్పడి నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా ట్రేడింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు దేశ వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్–ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హవాలా రాకెట్లు సైతం వీరి చేతుల్లోనే ఉండటంతో చిన్న చిన్న స్లిప్పులు, కొన్ని కరెన్సీ నెంబర్లను కోడ్‌వర్డ్స్‌గా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ద్రవ్య మార్పిడి చేసేస్తున్నారు.
హవాలా లింకులు ఉండటం కూడా మాఫియా హస్తానికి సంబంధించిన అనుమానాల్ని బలపరుస్తున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో అప్రమత్తమైన నిఘా, పోలీసు అధికారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు ట్రేడింగ్ లావాదేవీలు జరిగే ప్రాంతాలపై డేగకన్ను వేశారు.