LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్‌ అంబానీపై కేసు | CBI Registers Fresh Case Against Anil Ambani RCom Over LIC Loss Allegation | Sakshi
Sakshi News home page

LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్‌ అంబానీపై కేసు

Apr 1 2026 5:56 PM | Updated on Apr 1 2026 7:09 PM

CBI Registers Fresh Case Against Anil Ambani RCom Over LIC Loss Allegation

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని కష్టాలు వీడటం లేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ద్వారా ఎల్ఐసీని (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తాజా కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి సుమారు రూ.3,750 కోట్ల మేర ఎల్ఐసీకి నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ.

అసలేం జరిగింది?
కేసు వివరాల ప్రకారం.. 2009 నుంచి 2012 మధ్య కాలంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) జారీకి పూనుకుంది. ఆ సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల భద్రతపై తప్పుడు సమాచారం ఇచ్చి ఎల్ఐసీని నమ్మించారు. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఎన్సీడీలను కొనుగోలు చేసేలా ఎల్ఐసీని ప్రేరేపించారు. చివరికి ఈ వ్యవహారంలో ఎల్ఐసీకి రూ.3,750 కోట్లకు పైగా నికర నష్టం వాటిల్లింది.

ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు
బీడీఓ ఇండియా ఎల్ఎల్పీ (BDO India LLP) 2020లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఈ కుంభకోణంలోని లోతుపాతులను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. షెల్ కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ఇంటర్-కంపెనీ డిపాజిట్ల పేరుతో నిధులను స్వాహా చేశారు. ఉనికిలో లేని అమ్మకాల ఇన్వాయిస్‌లు, కల్పిత బిల్లులను సృష్టించి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. సెక్యూరిటీగా చూపిన ఆస్తుల విలువను వాస్తవం కంటే భారీగా పెంచి చూపినట్లు తేలింది. 

కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై అవినీతి నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ, ఆర్‌కామ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు అధికారులు తెలిపారు.

వరుస కేసులు
అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. మార్చి 8న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఫిర్యాదు మేరకు రూ.1,085 కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదైంది. ఇందులో పీఎన్‌బీకి రూ.621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.463.80 కోట్ల మేర బకాయిలు పడ్డారు. తాజా ఎల్ఐసీ కేసుతో అనిల్ అంబానీ సహా మాజీ డైరెక్టర్ల చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement