
క్యూ4లో రూ.280 కోట్లు
క్యూ3లోనూ రూ.262 కోట్లు
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలోనూ టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను వీడి రూ.280 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 849 కోట్ల నికర నష్టం నమోదైంది. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లోనూ రూ.262 కోట్ల నికర లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. వెరసి 2007 తదుపరి వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు ప్రకటించినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సిందియా వెల్లడించారు.
గత 18ఏళ్ల తరువాత నిర్వహణ లాభం, సానుకూల మార్జిన్లు, నికర లాభాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా(58 శాతం) తగ్గి రూ.2,247 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ.5,370 కోట్ల నష్టం నమోదైంది. నిర్వహణ ఆదాయం 8 శాతం ఎగసి రూ.20,841 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం బలపడి రూ.23,400 కోట్లకు చేరగా.. 2023–24లో నమోదైన 3 సర్కిళ్లతో పోలిస్తే సుమారు 10 సర్కిళ్లలో నికర లాభాలు సాధించినట్లు సిందియా వెల్లడించారు.
ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్‌ఆఫ్’
గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.24,432 కోట్ల పెట్టుబడులు వెచ్చించినట్లు తెలియజేశారు. ఆదాయంలో మొబిలిటీ నుంచి 6 శాతం వృద్ధితో రూ.7,499 కోట్లు లభించగా.. ఫైబర్ టు హోమ్ బిజినెస్ 10 శాతం అధికమై రూ.2,923 కోట్లు అందుకుంది. ఎంటర్‌ప్రైజ్ విభాగం 4 శాతం పుంజుకుని రూ. 4,096 కోట్ల ఆదాయం సాధించింది. 4జీ, 5జీ సేవలపై దృష్టి పెట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ఏ రాబర్ట్ జే రవి పేర్కొన్నారు.