న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.3,016 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు 2024–25 ఇదే క్యూ4లో ప్రకటించిన రూ.2,626 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం.
సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.21,751 కోట్ల నుంచి రూ.22,685 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా ఆదాయం రూ.18,323 నుంచి రూ.19,476 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పీఏ(మొండి బకాయిలు) 3.27% నుంచి 1.98 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.82% నుంచి 0.56 శాతానికి దిగివచ్చాయి.
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం ప్లస్
ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 407 కోట్లను అధిగమించింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 342 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు బ్యాంక్ బోర్డ్ షేరుకి రూ. 0.45 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 915 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 868 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొత్తం ఆదాయం మాత్రం ఫ్లాట్‌గా రూ. 2,945 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు త్రైమాసికవారీగా 2.86 శాతం నుంచి 2.95 శాతానికి మెరుగుపడ్డాయి. వార్షికంగా 3.21 శాతం నుంచి నీరసించాయి. స్థూల డిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.2 శాతం నుంచి 1.43 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.92 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 224 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు భారీగా తగ్గాయి.


