ఉద్యోగాలను మింగేస్తుందా? సృష్టిస్తుందా? | AI Wont Kill Jobs It Will Create Them NVIDIA CEO Jensen Huang Bold Reassurance | Sakshi
Sakshi News home page

AI.. ఉద్యోగాలను మింగేస్తుందా? సృష్టిస్తుందా?

May 5 2026 8:57 PM | Updated on May 5 2026 9:03 PM

AI Wont Kill Jobs It Will Create Them NVIDIA CEO Jensen Huang Bold Reassurance

ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ(ఏఐ)పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన... ‘ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా?’. ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘ఏఐ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగాల భయంపై హువాంగ్ స్పందన

మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హువాంగ్ ఏఐ వల్ల భారీగా ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఈ తరహా భయాందోళనలు కేవలం అపోహలని, ఇవి ప్రజలను సాంకేతికతకు దూరంగా ఉంచుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఏఐ కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవానికి నాంది. డేటా సెంటర్లు, అధునాతన హార్డ్‌వేర్, సహాయక ఎకోసిస్టమ్‌ల నిర్మాణం కోసం వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. ఆటోమేషన్ అనేది మొత్తం ఉద్యోగాలను తుడిచిపెట్టదు. కేవలం పనితీరులోని నిర్దిష్టమైన, పునరావృతమయ్యే పనులను మాత్రమే మారుస్తుంది. అంటే, మనిషి చేసే మొత్తం పనిలో కొంత భాగాన్ని ఏఐ సాయంతో సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, మనిషి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు’ అని చెప్పారు.

ఆందోళనలు ఎందుకు? వాస్తవాలేంటి?

హువాంగ్ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వేత్తలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. వివిధ కన్సల్టింగ్ సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 శాతం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు లేదా కొన్ని పాత తరహా పాత్రలు కనుమరుగయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన ఏఐ స్వీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని, సరైన శిక్షణ లేని వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనేది నిపుణుల ప్రధాన ఆందోళన.

భయం వద్దు.. నైపుణ్యం ముద్దు!

ప్రతి సాంకేతిక మార్పు వెనుక కొంత అనిశ్చితి ఉండటం సహజం. అయితే, టెక్ పరిశ్రమ సృష్టిస్తున్న హైప్‌కు భయపడి పురోగతిని ఆపడం సరికాదని హువాంగ్ సూచిస్తున్నారు. ఏఐని ఒక ముప్పుగా చూడటం కంటే.. మన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలి అనేది ఆయన మాటల సారాంశం. మొత్తానికి ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ స్వరూపం మారుతుందనేది వాస్తవం. అయితే, కాలంతో పాటు కొత్త నైపుణ్యాలను సంతరించుకునే వారికి ఏఐ ఒక వరం కానుంది. సాంకేతికత పట్ల భయాన్ని వీడి దానిని వాడుకోవడంలోనే భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement
 
Advertisement
Advertisement