భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువు దీరిన స్వామి వారికి విశ్వక్సేన పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి గురువారం సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
భద్రాచలం ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేస్తాం
డీసీహెచ్‌ఎస్ రవిబాబు నాయక్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ రవిబాబు నాయక్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆస్పత్రిలో నెలకొన్న లోటుపాట్లను సరిదిద్దుతున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌ఎంఓలతో కలిసివెళ్లి ఐటీడీఏ పీఓ రాహుల్‌కు ఆస్పత్రి సమస్యలు విన్నవించి, పరిష్కరించాలని కోరారు.
‘ఉద్దీపనం’తో
గుణాత్మక విద్య
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్
భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించేందుకు ఉద్దీపనం మెటీరియల్ ఉపయోగపడుతోందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అఽధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏలో ఉద్దీపనం మెటీరియల్ ప్రణాళికా అంశాలను పరిశీలించి మాట్లాడారు. ఉద్దీపనం పుస్తకాలతో 3,4,5వ తరగతి విద్యార్థుల్లో బేసిక్ లెవల్ నైపుణ్యాలు మెరుగుపడ్డాయని వెల్లడించారు.1, 2 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం కలిపి ఉద్దీపనం పుస్తకం రూపొందిస్తున్నట్లు తెలిపారు. 7,8, 9వ తరగతి విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షల్లో పాల్గొనేలా పుస్తకాన్ని రూపొందిస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులు 60 రోజులుగా పుస్తకాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. అధికారులు చందన, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


