విద్యాశాఖను వదిలేశారా..? | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖను వదిలేశారా..?

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

● విద్యాసంవత్సర ప్రారంభం కావడంతో హడావిడి ● సెలవుపై వెళ్లిన ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీఈఓ ● నలుగురు కోఆర్డినేటర్లలో ముగ్గురు మాతృస్థానాల్లోకి.. ● ప్రస్తుతం ఒక కోఆర్డినేటర్‌, ఏడీతో నెట్టుకొస్తున్న వైనం

● విద్యాసంవత్సర ప్రారంభం కావడంతో హడావిడి ● సెలవుపై వెళ్లిన ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీఈఓ ● నలుగురు కోఆర్డినేటర్లలో ముగ్గురు మాతృస్థానాల్లోకి.. ● ప్రస్తుతం ఒక కోఆర్డినేటర్‌, ఏడీతో నెట్టుకొస్తున్న వైనం

కొత్తగూడెంఅర్బన్‌: కొత్త విద్యాసంవత్సరంలో కూడా జిల్లా విద్యాశాఖలో మార్పులు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నెల 2న డీఈఓగా బాధ్యతలు చేపట్టిన వాసంతి మరుసటి రోజే సెలవుపై వెళ్లారు. ఈ నెల 25వ తేదీ వరకు చైల్డ్‌ కేర్‌ సెలవులో ఉండనున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు. 2026–27 విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభంకాగా, నెలరోజుల పాటు హడావిడి వాతావరణం ఉండనుంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, కొత్త అడ్మిషన్లు, రాగి జావ, మధ్యాహ్నభోజన పథకం, మెనూ ప్రకారం వంటలు తదితర విషయాలను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా జరగకపోతే తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇలాంటి కీలక సమయంలో జిల్లా విద్యాశాఖలో అధికారుల కొరత ఏర్పడింది. డీఈఓ సెలవులో ఉండగా, పదవీ కాలం ముగియడంతో గతంలో ఉన్న నలుగురు కో ఆర్డినేటర్లలో ముగ్గురు తమ మాతృస్థానాలకు వెళ్లారు. మిగిలింది ఒక్కరే. మరో అధికారి ఏడీ శంభూప్రసాద్‌ ఉన్నారు. అన్ని బాధ్యతలు వీరిద్దరే చూడాల్సి రావడంతో పనిభారం పెరిగింది. ఈ క్రమంలో విద్యార్థుల యూనిఫాం, భవిత కేంద్రాల పని తీరు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ఎంఈఓలకు నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాలు.. ఇలా అన్నింటిలోనూ విద్యాశాఖలో వెనుకబాటు కనిపిస్తోంది. వెరసి గత విద్యా సంవత్సరం మాదిరిగానే పాలన కొనసాగుతోంది.

అన్ని విభాగాల్లో వెనుకబాటు

డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కోఆర్డినేటర్లు కీలకంగా వ్యవహరిస్తారు. పదవీ కాలం ముగిసినా కొత్త వారు వచ్చే వరకు వారిని తాత్కాలికంగా కొనసాగించవచ్చని డీఎస్‌ఈ నుంచి ఆదేశాలున్నాయి. అయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోలేదు. గతంలో ఏఎంఓ, సీఎంఓ, జీఈసీఓ ఉండేవారు. ప్రస్తుతం ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ ఒక్కరే ఉన్నారు. జిల్లా విద్యాశాఖకు విడుదల అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, పథకాలు, అమలు చేయాల్సిన విధివిధానాలను అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా డీఈఓతోపాటు కోఆర్డినేటర్ల బాధ్యతలు నిర్వర్తించేవారు. జిల్లాలో ఉన్న 23 మంది ఎంఈఓలతో పాటు 90 మంది కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు డీఎస్‌ఈ నుంచి వచ్చే ఆదేశాలను చేరవేసి, అమలు చేసేలా చర్యలు తీసుకునే వారు. జూన్‌ నెల అంతా తీరిక లేకుండా విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ప్రస్తుతం కోఆర్డినేటర్‌ ఒక్కరే కావడంతో సమాచారం అందించేందుకు కూడా ఫోన్‌ లిఫ్ట్‌ చేసే పరిస్థితి లేదని ఎంఈఓలు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే పాలన గాడితప్పి ఫలితాలు గతేడాది కంటే తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. కలెక్టర్‌ స్పందించి జిల్లా విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement