ఆశలు.. ఆవిరి | - | Sakshi
Sakshi News home page

ఆశలు.. ఆవిరి

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

విత్తనాలకే రూ.70లక్షలు

ఆదిలోనే పత్తి రైతులకు ఎదురుదెబ్బ

సరైన వర్షం కురవక ఇక్కట్లు

భారమైనా రెండోసారి

విత్తేందుకు ఏర్పాట్లు

మొలకలు ఎండిపోతున్నాయి

విత్తనాలకే రూ.1.50 లక్షలు

బూర్గంపాడు: సీజన్‌ ఆరంభంలోనే పత్తి రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. అదును దాటుతుందనే భావనతో చినుకు పడకముందే పొడి దుక్కుల్లో గింజలు వేయగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అటూఇటు కాని వర్షంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పొడి దుక్కుల్లో వేసిన పత్తిగింజలు తేలికపాటి వర్షానికి మొలకలు వచ్చినా.. ఆ తర్వాత వరుణుడి కరుణ లేక అవి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు రెండోసారి పత్తి గింజలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇప్పటికే కొందరు రైతులు రెండో విడతగా గింజలు నాటడంలో నిమగ్నమయ్యారు.

50 వేల ఎకరాల్లో

జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలోనే రైతులు పత్తి విత్తనాలు నాటారు. ఇలా బూర్గంపాడు, అశ్వాపురం, టేకులపల్లి, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, ఇల్లెందు తదితర మండలాల్లో పొడి దుక్కుల్లోనే సుమారు 50 వేల ఎకరాలలో నాటినట్లు అంచనా. ఇలా నాటడం ద్వారా వర్షాలు పడగానే గింజలు మొలకెత్తుతాయని, తద్వారా త్వరగా పంట చేతికి వస్తుందని రైతులు నమ్ముతారు. ఈ నమ్మకంతోనే జూన్‌ మొదటివారంలో విత్తనాలు నాటగా, తేలికపాటి జల్లులకు గింజలు మెత్తబడి మొలకలు తిరిగాయి. కానీ, ఆ తర్వాత జల్లుల జాడ లేకపోవడంతో మొలకలు వడలిపోతున్నాయి. అంతేకాక నాలుగైదు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి రెండోసారి విత్తనాలు నాటుతుండగా.. ఇంకొందరు వర్షాలు కురిశాకే నాటాలనే భావనతో వేచిచూస్తున్నారు.

ముందుగానే అధికారుల హెచ్చరిక

ఏటా వ్యవసాయశాఖ అధికారులు ఒకటి, రెండు వర్షాలు కురిశాకే విత్తనాలు నాటాలని సూచిస్తారు. ఈసారైతే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని.. వరి, పత్తికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని విస్తృత ప్రచారం చేశారు. కానీ రైతులు మాత్రం తమ అనుభవాలకు అనుగుణంగా పొడి దుక్కుల్లో గింజలు వేసి దెబ్బతిన్నారు. ఈ నెల మూడో వారం వచ్చినా కనీసం నాలుగైదు సెం.మీ. వర్షం కూడా లేక పత్తితో పాటు ఇతర పంటల సాగుకు సైతం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ అంచనాలతో రైతులు ఆశలు చంపుకోలేక రెండో విడతగా పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జూన్‌, జూలై, ఆగస్ట్‌లోనే పత్తి పైరు ఎదగాలని, లేకపోతే ఆ తర్వాత వర్షాలు తక్కువగా ఉండి పైరు పెరుగుదల లోపిస్తుందని చెబుతున్నారు. అందుకే తొలివిడత నాటిన విత్తనాలు మొలకెత్తకపోయినా, రెండో సారి వేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మొదటిసారి పత్తి విత్తనాలు నాటేందుకు రైతులకు ఎకరానికి రూ.5వేలకు పైగా ఖర్చు అయింది. భూమి దుక్కి చేసేందుకు ఎకరాకు రూ.2వేలు, సాళ్లు తోలేందుకు రూ.వేయి, పత్తి విత్తనాలు రెండు ప్యాకెట్లకు రూ.1,700, గింజలు నాటిన కూలీలకు రూ.800 చొప్పున వెచ్చించారు. అయితే, ప్రతికూల వాతావరణంతో ఈ గింజలు దెబ్బతినగా మళ్లీ గింజలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెవెన్యూ పరిధిలోని రైతులు సుమారు 4 వేలకు పైగా ఎకరాల్లో పొడి దుక్కుల్లోనే పత్తి గింజలు వేశారు. వీరు విత్తనాల కొనుగోలుకే రూ.70లక్షల వరకు వెచ్చించినట్లు అంచనా. మళ్లీ రెండోసారి విత్తనాలకు అంతే మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి జిల్లాలోని అనేక గ్రామాల్లో నెలకొంది. రెండు విడతలు కలిసి రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా పెట్టుబడి పెట్టక తప్పదని తెలుస్తోంది.

వర్షాభావంతో ఎండిపోతున్న పత్తి మొలకలు

ఈ నెల 10వ తేదీన కురిసిన వర్షానికి పొడి దుక్కుల్లో వేసిన పత్తిగింజలు మొలకలు తిరిగాయి. అప్పటి నుంచి చినుకు జాడ లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయి. దీంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా నష్టం వచ్చింది. రెండో సారి విత్తనాలు వేయడానికి ఎకరాకు రూ.4 వేలకు పైగా ఖర్చవుతుంది.

– యడమకంటి రవీందర్‌రెడ్డి, రైతు, నాగినేనిప్రోలు

ఈనెల మొదటివారం 60 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. ఎకరాకు రెండున్నర ప్యాకెట్ల చొ ప్పున విత్తనాలకే రూ.1.50 లక్ష లు అయింది. తొలి వర్షానికి మొలకెత్తినా ఇప్పుడు ఎండిపోయాయి. మళ్లీ విత్తనాలు వేయిస్తున్నా. తొలివిడతలో విత్తనాలు, ఇతర ఖర్చులు రూ.2లక్షలు కాగా, మళ్లీ అంతే ఖర్చు పెట్టక తప్పదు. – గాదె ప్రభాకర్‌రెడ్డి, రైతు, రెడ్డిపాలెం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement