వీధి వ్యాపారులకు ‘స్వనిధి’ | - | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారులకు ‘స్వనిధి’

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

ఈ ఏడాదికి కొత్త లక్ష్యాలు

మెప్మా ఆధ్వర్యాన లబ్ధిదారుల నమోదు

ఇప్పటికే జిల్లాలో

రూ.70 కోట్లకు పైగా పంపిణీ

సంఘాల ఏర్పాటులో సత్తుపల్లి ముందంజ

ఖమ్మంమయూరిసెంటర్‌: కరోనా కష్టాల నుంచి కోలుకుని స్వయం ఉపాధితో ముందడుగు వేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్రప్రభుత్వ పీఎం స్వనిధి(ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి) పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఖమ్మంజి ల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీచేయడమే కాక వ్యాపార విస్తరణకు బ్యాంకుల నుంచి విడతల వారీగా రుణాలు ఇస్తున్నారు. మొదటి విడతగా రూ.15వేలు అందించి, అది సకాలంలో చెల్లిస్తే రెండో విడతగా రూ.24వేలు, అది చెల్లించాక మూడో విడతగా రూ.50వేల మేర రుణం మంజూరు చేస్తారు. తద్వారా వ్యాపారాల విస్తరణ, ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది.

31వేల మందికి పైగా గుర్తింపు

జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మెప్మా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 31,666 మంది వీధి వ్యాపారులను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీరిలో 31,207 మందికి గుర్తింపు కార్డులు, 24,959 మందికి వెండింగ్‌ సర్టిఫికెట్లు సైతం అందజేశారు. అత్యధికంగా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 23,993 మంది వ్యాపారులు నమోదయ్యారు.

చకచకా మంజూరు

చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించి వారి ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఇప్పటివరకు మొత్తం రూ.70.01 కోట్ల రుణాలు అందించారు. మొదటి విడతలో రూ.15వేల చొప్పున 22,449 మంది వ్యాపారులకు రుణాలు మంజూరు కాగా, అందులో 22,301 మందికి రూ.23.06 కోట్లు పంపిణీ చేశారు. ఖమ్మంలో అత్యధికంగా 16,596 మందికి, సత్తుపల్లిలో 2,013 మందికి మొదటి విడత సాయం అందింది. రెండో విడతలో రూ.25వేల చొప్పున(మొదటి విడత రుణం సకాలంలో చెల్లించిన వారికి) జిల్లాలో 11,535 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 11,434 మంది లబ్ధిదారులకు రూ.24.02 కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. ఇక మూడో విడతలో రూ.50వేలు చొప్పున (రెండో విడత రుణం సకాలంలో చెల్లించిన వారికి) 4,350 మందికి మంజూరు చేయగా, 4,263 మంది వ్యాపారులకు రూ.22.93 కోట్ల మేర ఆర్థికసాయం లభించింది.

సత్తుపల్లి, వైరా భేష్‌..

వీధి వ్యాపారులను ఉమ్మడి గ్రూపులు(సీఐటీ గ్రూపులు)గా ఏర్పాటు చేయడంలో జిల్లా ముందంజలో నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 284 గ్రూపులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో ఇప్పటివరకు 220 గ్రూపులను ఏర్పాటయ్యాయి. ఇందులో సత్తుపల్లి మున్సిపాలిటీ 22 గ్రూపుల లక్ష్యానికి వంద శాతంతో జిల్లాలో అగ్రస్థానాన నిలవగా, వైరా మున్సిపాలిటీ కూడా 21 గ్రూపులకు 20 గ్రూపులను ఏర్పాటు చేసి 95.24శాతానికి చేరింది. ఇక ఖమ్మం కార్పొరేషన్‌లో 218 గ్రూపుల లక్ష్యానికి గాను 158 గ్రూపులు ఏర్పాటయ్యాయి.

2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆరు పట్టణ ప్రాంతాల్లో పీఎం స్వనిధి కింద కొత్తగా లక్ష్యాలను నిర్దేశించారు.

మొదటి విడత : ఈ ఏడాది మరో 4,465 మంది వీధి వ్యాపారులకు మొదటి విడత రుణం అందించాలి. ఇందులో ఖమ్మం కార్పొరేషన్‌లో 2,867, ఏదులాపురంలో 704 మందిని లక్ష్యంగా నిర్దేశించారు. మిగతా లక్ష్యంలో ఇతర మున్సిపాలిటీల నుంచి ఎంపిక చేయా ల్సి ఉంటుంది.

రెండు, మూడో విడత : రెండో విడత కింద 2,004 మందికి, మూడో విడత కింద 553 మందికి రుణాలు ఇప్పించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

కేంద్రప్రభుత్వ పథకం ద్వారా రుణాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement