షాపుల్లోనే తనిఖీలు
గిరిజనుల చేతికి నిషేధిత
పత్తి విత్తనాలు?
ఉమ్మడి జిల్లాలోనే ఏన్కూరు కేంద్రంగా విక్రయాలు
కేసుల నమోదుతో
సరిపెడుతున్న యంత్రాంగం
ఏన్కూరు: ఏన్కూరు కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల విక్రయం జోరుగా సాగుతోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన హెచ్‌టీ బీసీ–3 విత్తనాలను కొందరు విక్రయిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళ గుడ్డ సంచుల్లో విత్తనాలను తీసుకొచ్చిన అక్రమార్కులకు గిరిజనులఅమాయకత్వమే ఆసరా అవుతోంది. ఈ విత్తనాలు వారికి అంటగడుతూ సొమ్మ చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాక నిషేధించిన కలుపు మందు గ్లైసిన్ కూడా విక్రయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, అడపాదడపా అధికారులు కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు.
గత ఏడాది కేసులు
మండలంలోని రేపల్లెవాడ, ఏన్కూరు గ్రామాల్లో గత ఏడాది నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకువచ్చి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకొని రూ.14 లక్షల విలువైన 560 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉండే ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జోరుగా సాగుతోందని సమా చారం. ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం చేరవేస్తూ విత్తనాలు ఇస్తున్నారని తెలిసింది.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు..
హెచ్‌టీ బీటీ–3 విత్తనాల సాగుతో ప్రజలకేగాక ఇతర ప్రాణులు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ విత్తనాల సాగుతో కలుపు బెడద లేకు న్నా అనేక నష్టాలు ఎదురవుతాయని చెబుతున్నా రు. మరోపక్క కొన్నిచోట్ల కలుపు నివారణకు నిషేధిత గ్లైసిన్ మందు పిచికారీ చేస్తుండడం, ఈ భూముల్లో పంట అవశేషాలను పశువులు, మేకలు తింటే అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతాయి. వీటి ఉత్పత్తి, అమ్మకాలపై నిషేధం ఉన్నా అక్రమార్కులు దొడ్డిదారిన తీసుకొచ్చి గిరిజన రైతులకు అంటగడుతున్నారని సమాచారం.
మండలంలో మూడేళ్లుగా ననిలీ విత్తనాల దందా సాగుతున్నా వ్యవసాయ, పోలీసు శాఖలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ బృందాలు లైసెన్సు కలిగిన విత్తన దుకాణాల్లో తనిఖీ చేస్తూ, గ్రామాల్లో లూజ్‌గా జరుగుతున్న అమ్మకాలపై దృష్టి పెట్టడంలేదని చెబుతున్నారు. ఇకనైనా గ్రామాల్లో సైతం విస్తృత తనిఖీలు చేయడమే కాక నిషేధిత విత్తనాల సాగుతో ఎదురయ్యే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.


