సాగుతున్న పనులు.. | - | Sakshi
Sakshi News home page

సాగుతున్న పనులు..

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

వర్షపాతం

సంప్రదాయ పంటల వైపే మొగ్గు చూపుతున్న ఎక్కువ మంది

తగిన వర్షపాతం నమోదయ్యాకే విత్తుకోవాలని సూచిస్తున్న వ్యవసాయశాఖ

వర్షాలు రాకపోతే..

అవగాహనతో చేపట్టాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వర్షాలు కురుస్తుండటంతో రైతులు వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభించారు. వానాకాలంలో 6,37,800 ఎకరాల్లో వివిధ పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గత వానాకాలం సీజన్‌ కంటే ఈసారి 28,178 ఎకరాల్లో పంటల సాగు పెరగనుంది. ఎప్పటిలాగే సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండటంతో రైతులు కలవరం చెందుతున్నారు. వర్షాధారంగా సాగు చేసే రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రమంతా విస్తరించలేదని, రాబోయే ఐదారు రోజులు ఎండ తీవ్రత అధికంగానే ఉంటుందని, రైతులు తొందరపడి విత్తనాలు విత్తొద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సరిపడా వర్షపాతం నమోదై, నేలలో తగిన తేమశాతం ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని అవగాహన కల్పిస్తున్నారు.

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

వరి: స్వల్పకాలిక, మధ్యకాలిక వరి రకాలు మాత్రమే నారు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలను జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు.

పత్తి: పత్తి విత్తనాలను జూలై 20 వరకు విత్తుకోవచ్చు. వారం వ్యవధిలో తేలిక నేలల్లో 50–60 మి.మీ వర్షపాతం, నల్లరేగడి బరువు నేలల్లో 60–75 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవాలి

కంది: ఏక పంటగా లేదా పత్తి, పెసర, మినుము, వేరుశెనగ, మొక్కజొన్న, జొన్నలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి మొక్కల సాంద్రత పెంచి ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు.

మొక్కజొన్న: నీటి ఎద్దడి, నీటి నిల్వను తట్టుకోలేని పంట. బోడేలు– చాళ్ల పద్ధతిలో విత్తితే తేమ నిల్వ ఉంటుంది. అధిక వర్షం కురిసినప్పుడు మురుగునీరు సులభంగా బయటకు వెళ్తుంది. మధ్యకాలిక సంకరాలను జూలై 15 వరకు స్వల్పకాలిక సంకరాలను జూలై చివరి వరకు విత్తుకోవచ్చు.

జొన్న: జూన్‌ నెల చివరి వరకు విత్తుకోవచ్చు

పెసర/మినుము: తక్కువ కాలపరిమితి కలిగిన పంటలు. జూలై 15 వరకు విత్తుకోవచ్చు.

వేరు శెనగ: జూలై 31 వరకు విత్తుకోవచ్చు.

పొద్దుతిరుగుడు: తేలిక నేలల్లో జూలై 15 వరకు, బరువు నేలల్లో ఆగస్టు 30 వరకు విత్తు కోవచ్చు.

జిల్లాలో బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 35.9 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 115 మి.మీ, దుమ్ముగూడెంలో అత్యల్పంగా 8.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కరకగూడెం 38.6, పినపాక 31.2, చర్ల 40.2, అశ్వాపురం 14.2, మణుగూరు 14.6, ఆళ్లపల్లి 43.4, గుండాల 82.2, ఇల్లెందు 16.4, టేకులపల్లి 39.8, జూలూరుపాడు 102.4, అన్నపురెడ్డిపల్లి 37, చుంచుపల్లి 48.4, సుజాతనగర్‌ 62, కొత్తగూడెం 50.4, లక్ష్మీదేవిపల్లి 47, పాల్వంచ 36.2, బూర్గంపాడు 11.6, భద్రాచలం 13.4, ములకలపల్లి 12.8, దమ్మపేట 34.6, అశ్వారావుపేట మండలంలో 18.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

అడపాదడపా వర్షాలకు వ్యవసాయ పనులు చేపడుతున్న రైతులు

వర్షాలు ఎక్కువగా కురవవు అనే ప్రచారం ఆందోళన కలిగిస్తోది. మాకు సాగు పంటలపై వ్యవసాయాధికారులు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులను ప్రారంభించాం.

– తోలెం సావిత్రి, మహిళా రైతు, కరకగూడెం

వానాకాలం సీజన్‌ వ్యవసాయ పనుల్లో రైతులు తొందర పడకుండా స్థానిక వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో చేపట్టాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలి. నాణ్యమైన విత్తనాలను విత్తుకోవాలి.

– వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement