ధర లేదు.. | - | Sakshi
Sakshi News home page

ధర లేదు..

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

యాసంగిలో పీఆర్‌ 126 రకం వరి సాగు చేసిన రైతులు

ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి

కొనుగోళ్లకు ఆసక్తి చూపని మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు

దిగుబడి పెరిగింది

తక్కువ సమయంలో

ఎక్కువ దిగుబడి

దిగుబడి పెరిగినా

పాల్వంచరూరల్‌: గతేడాది వరకు రైతులు యాసంగిలో హెచ్‌ఎంటీ వంటి దొడ్డు రకాలను సాగు చేశారు. ఆశించిన దిగుబడి రాకపోవడతో ఈసారి పంజాబ్‌ రైస్‌ (పీఆర్‌ 126) వరి సాగు చేపట్టారు. ఆశించినట్టే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది. అయితే మిల్లర్లు, వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పీఆర్‌ 126 రకం ప్రత్యేకత

పీఆర్‌–126 రకం వరి తక్కువ నీరు, మిగతా రకాల కంటే పక్షం రోజుల ముందుగానే పంట చేతికి వస్తుంది. దొడ్డు రకాలైన హెచ్‌ఎంటీ రకం ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తున్నాయి. పీఆర్‌ రకం మాత్రం ఎకరాకు 30 నుంచి 33 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు ఐదు నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి పెరిగింది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ఎక్కువ రోజులు రాశిగా పోసి ఉంచటంతో గింజపై మచ్చలు వచ్చాయని, కొంత నలుపు రంగులో వడ్లు కన్పిస్తున్నాయని రైతులు చెబుతున్నారు.

ఆసక్తి చూపని వ్యాపారులు

పీఆర్‌ 126 రకం యాసంగి వరి దిగుబడి దొడ్డు రకమైనా మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాల్వంచ, బూర్గంపాడు తదితర మండలాలతోపాటు జిల్లాలో అనేక గ్రామాల్లో రైతులు యాసంగిలో ఇదే రకం వరిసాగుచేశారు. ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,369 చెల్లిస్తున్నా.. మిల్లర్లు మాత్రం ఈ రకం ధాన్యం తీసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1800 లోపే చెల్లిస్తున్నారు. మిల్లర్లు కూడా అధిక తరుగు తీయాలంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌ రైస్‌ నూతన వరి విత్తనాన్ని నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. తక్కువ నీటి వినియోగంతోపాటు అనుకున్న దానికంటే పదిరోజుల ముందే పంటదిగుబడి వచ్చింది. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే గిట్టుబాటు ధర లేదు. ఎఫ్‌సీఐ నిబంధనలు కారణంగా ఎక్కువ తరుగు అడుగుతున్నారు. మిల్లర్లు తిరస్కరిస్తున్నరు.

–టేకుల నర్సింహారెడ్డి, రైతు, రెడ్డిగూడెం

పీఆర్‌–126 రకం వరి ధాన్యం పంజాబ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ రకం వరి పంటను యాసంగిలో రైతులు అధికంగా చేశారు. నాటు వేసిన 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకునే గుణం ఉంది. తెగుళ్ల బారిన పడకుండా ఉంటుంది. వర్షం కురిసినా గింజలు రాలకుండా బలంగా ఉంటాయి. ఎకరానికి 30 నుంచి 33 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

– బి.శంకర్‌, మండల వ్యవసాయశాఖ అధికారి, పాల్వంచ

Advertisement
 
Advertisement
Advertisement