దేవేరుల గనులు! | - | Sakshi
Sakshi News home page

దేవేరుల గనులు!

Mar 9 2026 7:25 AM | Updated on Mar 9 2026 7:25 AM

పద్మావతి పేరుతో..

సింగరేణి సంస్థలో గనుల పేర్లకు ప్రత్యేకత నంబర్లు, జాతీయ నాయకుల పేర్లతో కూడా..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ తీరంలో ప్రాణహిత దగ్గర నుంచి మొదలు పెడితే పాపికొండల వరకు ప్రాచీన జీవజాతులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఒకప్పటి దండకారణ్యంలో భాగంగా ఉన్న జిల్లాలో ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పినపాక మండలం పాండురంగాపురం దగ్గర రాకాసి గూళ్లు (పురాతన సమాధులు), ములకలపల్లి మండలం అక్షరలొద్ది, ఒంటిమిట్టగుండుల దగ్గర రాక్‌ పెయింటింగ్‌లు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. బౌద్ధ విహారాలు, రాష్ట్ర కూటులు, కాకతీయులు కట్టించిన ఆలయాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అయితే, చరిత్ర గర్భంలో కలిసిపోయిన దేవీదేవేరులను సింగరేణి సంస్థ వెలుగులోకి తెచ్చింది.

విభిన్నంగా..

ఖని అంటే గని అనే అర్థం. ఆరంభంలో సింగరేణి గనులకు నంబర్లతో లేదా ఆ గనికి పర్యవేక్షకుడిగా ఉన్న అధికారుల పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొత్తగూడెంలో అధికారి పేరు మీద బర్లి పిట్‌ గని ఉండేది. బొగ్గును వెలికితీసే పద్ధతిని బట్టి ఇల్లెందులో 21 పిట్‌, స్ట్రట్‌పిట్‌ ఉండగా, ఇతర ఏరియాల్లో 5 ఇంక్లైన్‌, 7 ఇంక్లైన్‌, 8 ఇంక్లైన్‌, సెంచరీ ఇంకై ్లన్‌ పేర్లతో గనులు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకుల పేర్ల మీదుగా కూడా గనులు వచ్చాయి. ఇల్లెందులో జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు మీదుగా జవహర్‌ఖని (జేకే), రామకృష్ణాపూర్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరు మీద రవీంద్రఖని (ఆర్‌కే), మణుగూరులో టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశంఖని (పీకే) ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. భూపాలపల్లి ఏరియాలో గనులను కాకతీయఖని (కేకే), బెల్లంపల్లిలో శాంతిఖని, మందమర్రిలో కల్యాణిఖనిగా నామకరణం చేశారు. కొన్ని గనులు అక్కడున్న గ్రామం పేరుతో కూడా వచ్చాయి. మణుగూరులో కొండాపూర్‌ ఓసీ, ఇల్లెందులో పొలంపల్లి గనులు ఉన్నాయి. రామగుండం దగ్గర గోదావరి నది తీరంలో బొగ్గు గనులు రావడం, అక్కడ కార్మిక బస్తీలు పెరిగిపోవడంతో ఏకంగా గోదావరిఖని (రామగుండం) పేరుతో కార్పొరేషన్‌ ఏర్పాటైంది. కానీ, సింగరేణి వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం ఏరియాలోనే వెంకటేశ్‌ఖని, పద్మావతిఖని అంటూ దేవుడి పేర్లతో గనులు వచ్చాయి.

వెలుగులోకి వెంకటేశ్వరుడు

పద్మావతిఖనికి సమీపంలో వెంకటేశ్వరుడి విగ్రహం లభ్యమైంది. అప్పటికే కొత్తగూడెంలో 1 నుంచి 6 వరకు నంబర్లతో గనులు వచ్చాయి. దీంతో 1957లో మొదలైన గనికి వెంకటేశ్‌ఖని, ఆ తర్వాత వీకే–7గా పేరు పెట్టారు. 70 ఏళ్లకు పైగా వీకే, పీవీకే పేర్లతో కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆయువుపట్టుగా పద్మావతి, వెంకటేశ్‌ గనులు నిలిచాయి. గత చరిత్రకు గుర్తుగా ఇక్కడున్న ఓ కొండపై శ్రీభూనీల సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సింగరేణి నిర్మించింది. బొగ్గు నిక్షేపాలు తరిగిపోవడంతో వీకే గని 2021లో మూతపడింది. తాజాగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ఏకకాలంలో భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీసే వీకే మెగా మైన్‌గా మళ్లీ వెలుగులోకి వచ్చింది.

బుద్ధుడికీ ఓ గని..

కొత్తగూడెం సమీపంలో కారుకొండ దగ్గర గౌతమ బుద్ధుడి విగ్రహాలు వెలుగు చూశాయి. వీటిని ఆర్కియాలజీ సంస్థ రక్షిత స్థలాలుగా ప్రకటించింది. ఈ చరిత్రకు గౌరవాన్ని కల్పిస్తూ గౌతంఖని పేరుతో ఒక ఓపెన్‌కాస్ట్‌ మైన్‌ను సింగరేణి సంస్థ 1991లో ప్రారంభించింది. ఈ గనిలో పని చేసే కార్మికుల కోసం కట్టించిన కాలనీకి గౌతంపూర్‌ కాలనీగా పేరు పెట్టింది. అయితే, ఈ గని కూడా 2021లో మూతపడింది.

స్వాతంత్య్రానికి ముందే సింగరేణి బొగ్గు గనులు ఇల్లెందు, బెల్లంపల్లిలో ప్రారంభయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడేనికి 1936లో విస్తరించాయి. ఈ క్రమంలో తొలి గనిగా ప్రస్తుత హెడ్‌ ఆఫీస్‌ దగ్గర బర్లిపిట్‌ మొదలైంది. అయితే, ఇక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఈ గని మూతపడింది. ఆ తర్వాత రామవరం దగ్గర గనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్కడున్న కొండలు, గుట్టల్లో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తుండగా అక్కడ భూమి పొరల్లో మరుగున పడిన ఓ శిలా విగ్రహం లభ్యమైంది. ఆనవాళ్లను బట్టి పద్మావతిదేవి విగ్రహంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో 1952లో మొదలైన గనిని పద్మావతిఖని పేరుతో పిలవడం మొదలైంది.

కొత్తగూడెంలో బొగ్గు బావులకు దేవుళ్ల పేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement