భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
పెద్దమ్మతల్లికి
విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హాజరుకావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ఐటీడీఏలో
గిరిజన దర్బార్
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు.
తహసీల్దార్ కార్యాలయంలో..
భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు.
‘మిల్లెట్’ మహిళకు సత్కారం
భద్రాచలం: ఐటీడీఏ సహకారంతో స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన మహిళను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించారు. భద్రాచలం గిరిజన మహిళలు మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. వీరి స్ఫూర్తి కథపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కొమరం భీమ్ భవనంలో మిల్లెట్ బిస్కెట్ తయారీదారు వెంకటలక్ష్మి ఘనంగా సత్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, ధనసరి సీతక్క, పురస్కారం అందజేశారు.


