● సమస్యల సత్వర పరిష్కారానికి కృషి ● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా అన్ని 33 కేవీ లైన్లలోని 38 ఫీడర్ల పనులు పూర్తిచేసినట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. 11 కేవీ లైన్లలోని 252 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్ రాస్తున్నట్లు తెలిపారు. దీంతో నిర్వహణ పనులను కూడా సమర్థవంతంగా ట్రాక్ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్సఫార్మర్ల వైఫల్యాలు వంటి వివరాలను కూడా సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ పోల్ నంబర్ ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకుని, సిబ్బంది సత్వరమే అక్కడికి చేరుకుంటారని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రియల్ టైమ్‌లో కచ్చితమైన సమాచారం పొందే అవకాశం ఉండటంతోపాటు వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని, ఫీడర్ల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్‌ఈ వివరించారు.


