● గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెంపు ● రూ. 952కు చేరిన 14.2 కేజీల సిలిండర్ రేటు ● పెరిగిన ధరతో జిల్లాపై రూ. 2.81కోట్ల భారం
పాల్వంచరూరల్: పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో దేశంలోని చమురు సంస్థలు వంట గ్యాస్ ధర పెంచాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.842 ఉండగా, గతేడాది రూ. 50 పెంచడంతో రూ.892కు చేరింది. శనివారం నుంచి మరో రూ. 60 పెంచడంతో ప్రస్తుతం రూ.952కు పెరిగింది. పెరిగిన ధరతో జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై రూ.2,81,44,500 భారం పడుతోంది. వంట గ్యాస్ ధరలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే గ్యాస్ ధర పెంపుతో మరింత భారం పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,953 ఉండగా, రూ.114 పెంపుతో ప్రస్తుతం రూ.2,067కు పెరిగింది.
జిల్లాలో 4,69,075 మంది గృహ వినియోగదారులు
జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు 4,69,075 మంది ఉన్నారు. ఇందులో సింగిల్ సిలిండర్ వినియోగదారులు 2,41,175 మంది, రెండు సిలిండర్లు కలిగినవారు 98,868 మంది ఉన్నారు. దీపం కనెక్షన్లు 53,405, కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ పర్సన్(సీఎస్‌ఆర్) కనెక్షన్లు 2465, ఉజ్వల పథకం కనెక్షన్లు 73,162 ఉన్నాయి.


