సంస్థను మరింత అభివృద్ధి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సంస్థను మరింత అభివృద్ధి చేద్దాం

Mar 8 2026 7:43 AM | Updated on Mar 8 2026 7:43 AM

● సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి ● కొత్తగూడెంలో వీకే–7 కోల్‌మైన్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం

● సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి ● కొత్తగూడెంలో వీకే–7 కోల్‌మైన్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం

రుద్రంపూర్‌: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు లోతుగా చర్చించి సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేద్దామని, ఇందుకోసం జనరల్‌ అసిస్టెంట్‌ నుంచి జీఎంల వరకు అందరూ సహకరించాలని సంస్థ సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి అన్నారు. శనివారం ఆయన కొత్తగూడెంలోని వీకే–7 కోల్‌మైన్‌లో బొగ్గు ఉత్పత్తి, రవాణాను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఆ తర్వాత పీవీకే–5 ఇంక్లైన్‌ గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గనిలో సీములు, ఉత్పత్తి, నిక్షేపాల నిల్వ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగినితో కొబ్బరికాయలు కొట్టించారు. కార్మికులకు స్వయంగా ప్రసాదం తినిపించారు. అనంతరం గనిలోకి దిగి బొగ్గు ఉత్పత్తి ప్రదేశాన్ని సందర్శించారు. కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థలో సబార్డినేటర్లు ఎవరూ లేరని, అందరూ ఒకే కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. గనుల్లో 60 శాతం, ఓసీల్లో 90శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఈ నెల 6న మణుగూరు ఏరియాలో సందర్శించి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. త్వరలో సమసలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కార్మిక సంక్షేమానికి కృషి చేస్తామని, సింగరేణి సంస్థ ప్రత్యేకమైన పబ్లిక్‌ సెక్టార్‌ అని, రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తోందని వివరించారు. అందరిని సమన్వయం చేసుకుంటూ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. తొలుత యూనియన్‌ నాయకులను శాలువాలతో సన్మానించారు. కాగా, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ బుద్ధ ప్రకాశ్‌ జ్యోతిని కలెక్టర్‌ అంకిత్‌ కలిశారు. మొక్క అందజేశారు. జిల్లా మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని సీఎండీని కలెక్టర్‌ కోరారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ, సింగరేణి డైరెక్టర్లు కేవీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, తిరుమలరావు, సీడీఎన్‌ శ్రీనివాస్‌ రావు, కొత్తగూడెం జీఎం ఎం.శాలేంరాజు, ఇతర అధికారులు కోటిరెడ్డి, మోహన్‌రావు, రామకృష్ణ శ్యాంప్రసాద్‌, కార్మిక నాయకులు ఎండీ రజాక్‌, వంగా వెంకట్‌, మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement