సూపర్‌బజార్(కొత్తగూడెం)/సుజాతనగర్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్‌లో అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్‌శర్మతో కలిసి వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ కార్యక్రమాలపైనా సమీక్షించారు. జిల్లా లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజువారీ వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. నాలుగు దశల్లో అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో తొలి దశలో మార్చి 6 నుంచి 31వ తేదీ వరకు మాతా, శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ పనితీరుపై ప్రతీ నెల సమగ్ర నివేదికను అందించాలని డీఎంహెచ్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రు లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది కొరతపై అధికారులు కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాంరాథోడ్, డీసీహెచ్‌ఓ రవిబాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైద్యశిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్
99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ చెప్పారు. సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతీరోజు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చొప్పున వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ వైద్య శిబిరాల్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజీ, డెంటల్, ఆఫ్తమాలజీ వంటి ఆరు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిబిరాలకు వచ్చే రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు మెరుగైన చికిత్స కోసం పైస్థాయి ఆస్పత్రులకు రిఫర్ చేయాలని పేర్కొన్నారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఈ వైద్య శిబిరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాంరాథోడ్, మేయర్ మూడు గణేశ్, తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, మెడికల్ ఆఫీసర్ రమేశ్, ఎంపీడీఓ భారతి తదితరులు పాల్గొన్నారు.


