అవరోధాలు ఎదుర్కొంటున్న
మార్కెటింగ్ శాఖ
ఈ ఆర్థిక సంవత్సరంలో
లక్ష్యం రూ.22.65 కోట్లు
11 నెలల్లో సాధించింది
రూ.15.04 కోట్లు
ఒక నెలలో సాధించాల్సింది
రూ.7.61 కోట్లు
లక్ష్య సాధనకు ఆటంకాలు
ఇల్లెందు/సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా మా ర్కెటింగ్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఆదాయ లక్ష్య సాధనకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. వార్షిక ఆదాయ లక్ష్యం రూ. 22,65,42,000 కాగా 11నెలల్లో రూ. 15,04,77,000 ఆదాయాన్ని మాత్రమే సాధించింది. మిగిలిన రూ.7.61 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చిలో సాధించేందుకు కృషి చేస్తున్నా రు. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం, చర్ల మండలాల్లో వ్యవ సాయ మార్కెట్లు ఉన్నాయి. జిల్లాలో మార్కెట్ శాఖకు అనుబంధంగా 18 చెక్‌పోస్టులు ఉన్నాయి. 15 నాబార్డు, 34 నాన్ నాబార్డు గోడౌన్‌లు ఉన్నా యి. ఇవి కాకుండా కొత్తగూడెం మార్కెట్ యార్డుకు అనుబంధంగా 44 గదులు, భద్రాచలం మార్కెట్ యార్డుకు అనుబంధంగా 21 గదులు ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం మార్కెట్ ఫీజు రూపంలో సమకూరుతుంది. కొనుగోలు కేంద్రాలకు మార్కెటింగ్ శాఖ ద్వారా కాటాలు, టార్పాలి న్లు, మాయిశ్చర్ పరికరాలను అందజేస్తారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల నుంచి కూడా మార్కెట్ ఫీజు లభిస్తుంది. అయినప్పటికీ లక్ష్యసాధనలో విఫలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కూడా మొక్కజొన్న కొనుగోళ్లు జరగడం వల్ల మార్కెట్ ఫీజును పొందలేక పోవడం కూడా ఆదాయ లక్ష్యసాధనకు అడ్డంకిగా మారింది. వానాకాలం సాగులో పత్తి ప్రకృతి వైపరీత్యాల కారణంగా సరైన దిగుబడి లేకపోవడంతో కొనుగోళ్లు మందగించాయి. దీంతో మార్కెట్ ఫీజు ఆదాయానికి గండి పడింది.
వార్షిక లక్ష్య సాధనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. వానాకాలం సీజన్‌లో పత్తి దిగుబడి బాగా తగ్గడంతో కొనుగోళ్ల సందర్భంలో మార్కెట్ ఫీజు తగ్గింది. మొక్కజొన్న కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ కూడా చేస్తుండడంతో అక్కడి నుంచి కూడా మార్కెట్ ఫీజు రాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల నిర్దేశిత లక్ష్యం సాధించడం కష్టతరంగా మారింది.
–జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి


