భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం పట్టణానికి చెందిన రామరాజు కాటన్ డిస్ట్రిబ్యూటర్ నీలి దేవిప్రసాద్ శుక్రవారం రెండు వీల్‌చైర్లను వితరణగా అందజేశారు. ఆలయ ఈఓ కె.దామోదర్‌రావుకు వీటి ని అందజేయగా దాతను ఆయన అభినందించారు. ఏఈఓ శ్రావణ్‌కుమార్, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉద్యోగులు సాయిబాబా, రజిని, రాము, శివరామకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ, నిమ్స్‌మే (హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యాన గిరిజన యువత, రైతులకు తేనెటీగల పెంపకంపై ఐదు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 18 –40 ఏళ్ల లోపు వారు శిక్షణ కు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళ లు, పురుషులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్‌లతో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు రావాలని పీఓ సూచించారు.
ఇసుక తరలుతోంది..
అశ్వారావుపేటరూరల్: మండలంలోని నారాయణపురం జీపీ జగన్నాథపురం శివారులో గల పెద్దవాగు నుంచి కొద్ది రోజులుగా వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలు, రాత్రి తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా వాగు వద్ద వందలాది ట్రాక్టర్లు ఇసుక కోసం బారులుదీరి క్యూలో కనిపించాయి. అయినా, సరే అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు స్థానికులు బారులుదీరిన ఇసుక ట్రాక్టర్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
తుమ్మల చొరవపై హర్షం
దమ్మపేట: తెలంగాణ హార్టికల్చర్, ఆయిల్‌ఫెడ్‌పై ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యం హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను తొలగింపజేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌ను ఏర్పాటు చేసినందుకుగాను రాష్ట్ర పామాయిల్ సలహాదారు కమిటీ సభ్యులు ఆలపాటి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. టీజీ ఆయిల్‌ఫెడ్ సాధించిన ఓఈఆర్‌నుప్రామాణికంగా తీసుకోకుండా ప్రైవేట్ కంపెనీల ఓఈఆర్‌నే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం రైతులను దోచుకోవడమేనని పేర్కొన్నారు.
విధుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
పాల్వంచ: విధుల్లో ఉద్యోగులు తప్పక భద్రతా చర్యలు పాటించాలని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్‌రావు అన్నారు. శుక్రవారం స్థానిక కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో 55 వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి విధిగా భద్రతా సూత్రాలను పాటిస్తూ, పరికరాలను ధరించాలని సూచించారు. కార్యక్రమంలో సెఫ్టీ కమిటీ చైర్మన్, ఎస్‌ఈ బి.శివరాంరెడ్డి, ఎస్‌ఈలు టి.సత్యనారాయణ, పి.కృష్ణ, డీవైసీసీఏ రామారావు, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, సెఫ్టీ డీఈ సమ్మయ్య, ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ పీరా, ఏడీఈ వెంకటేశ్వర్లు, నాగయ్య, ఏఈలు మహే శ్, నాగరాజు, రజిని, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళను వేధించిన వ్యక్తికి జైలు
ఇల్లెందు: పట్టణంలోని 24 ఏరియాకు చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి వేధించాడు. ఈ కేసులో ఇరువైపులా వాదనలు విన్న ఇల్లెందు కోర్టు న్యాయమూర్తి డి.కీర్తిచంద్రికరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. కృష్ణకు ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.5వేలు జరి మానా విధించారు. 2018లో మహిళను వేధించిన కృష్ణపై అందిన ఫిర్యాదు మేరకు ఆనాటి సీఐ డి.వేణుచందర్ కేసు నమోదు చేసి, కోర్టు లో చార్జిషీటు దాఖలు చేశారు.


