విద్యుదాఘాతంతో రైల్వే ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైల్వే ఉద్యోగి మృతి

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

మణుగూరుటౌన్‌: మండలంలోని రైల్వేస్టేషన్‌ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. రైల్వే సిగ్నల్‌ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రంగ నవీన్‌ (33) ఇటీవల కారు కొనుగోలు చేశాడు. కారును పార్కింగ్‌ చేసేందుకు పాత రన్నింగ్‌ రూం వద్ద షెడ్‌ తొలగిస్తుండగా వైర్‌ తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఏడాది క్రితం నవీన్‌కు వివాహం జరగగా ఆయన భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. వీరి వివాహ వార్షికోత్సవం శుక్రవారమే. ఇదేరోజు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

భార్యను హత్యచేసిన వ్యక్తికి జీవితఖైదు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన లకావత్‌ సైదులు తన పెద్ద కుమార్తె స్నేహను మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ కట్టుకుంటతండా వాసి భూక్య శ్రీధర్‌కు ఇచ్చి 2021 జులై 30న వివాహం జరిపించాడు. వారం రోజుల్లోనే అత్తింటి వేధింపులతో స్నేహ పుట్టింటికి తిరిగి వచ్చింది. తండ్రి సర్దిచెప్పి తిరిగి భర్త వద్దకు పంపాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరిగి మళ్లీ స్నేహ తిరిగి వచ్చింది. కాగా, 2023 మే 20వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య స్నేహపై భర్త భూక్య శ్రీధర్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో శ్రీధర్‌కు కూడా గాయాలయ్యాయి. స్నేహను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. స్నేహ తండ్రి ఫిర్యాదు మేరకు భర్త భూక్య శ్రీధర్‌, అత్త భూక్య అచ్చమ్మ, మామ భూక్య భాస్కర్‌పై అప్పటి ఎస్‌ఐ కె.సుమన్‌ కేసు నమోదు చేయగా అప్పటి సీఐ ఎ.రమాకాంత్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 17 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి భూక్య శ్రీధర్‌పై నేరం రుజువు కావడంతో జీవితఖైదు, రూ.వెయ్యి జరిమానా విధించారు. అత్తమామలపై కేసు కొట్టివేశారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటలోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. జూలూరుపాడుకు చెందిన నాగేశ్వరరావు చుట్టుపక్కల గ్రామాల నుంచి రేషన్‌ బియ్యం కొని, మాచినేనిపేట శివారులోని నరసింహారావు కోళ్ల ఫారంలో డంప్‌ చేశాడు. స్థానిక సీఐ శ్రీలక్ష్మి, పోలీస్‌ సిబ్బంది సమాచారం మేరకు దాడి చేసి, 23 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ సుమారు రూ.51 వేలు ఉంటుందని తెలిపారు. నాగేశ్వరరావు, నరసింహారావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ద్విచక్రవాహనం చోరీ

పాల్వంచరూరల్‌: మండలంలోని పెద్దమ్మగుడి వద్ద మరో ద్విచక్రవాహనం చోరీకి గురైంది. దుమ్ముగూడెం మండలం రేగుంటకు చెందిన ఎస్‌.జీవన్‌ గత నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి బైక్‌పై వచ్చి, సమీపాన పార్కింగ్‌ చేసి ఆలయంలోకి వెళ్లి వచ్చేసరికి బైక్‌ చోరీకి గురైంది. ఘటనపై ఆయన శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ.సురేశ్‌ తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితుడు?

జల్సాలకు అలవాటుపడిన దుమ్ముగూడెం ప్రాంత యువకులు ద్విచక్రవాహనాలను చోరీచేసి తాకట్టు పెడుతున్నాడని సమాచారం. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తి 26 బైక్‌లు చోరీ చేసినట్లు గుర్తించగా, విచారణ కొనసాగుతోందని సమాచారం.

పశువులు పట్టివేత

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న పశువులను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల నుంచి హైదరాబాద్‌కు వాహనంలో తొమ్మిది పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించి, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌ ఎస్‌ఐ శ్యాంప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement