‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీసీ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీసీ

Mar 6 2026 8:23 AM | Updated on Mar 6 2026 8:23 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అధ్యక్షతన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అధికారులకు వివరించారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన మాట్లాడుతూ.. జిల్లాలో 99 రోజుల కార్యక్రమాల నిర్వహణకు కలెక్టర్‌ నేతృత్వంలో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. వీసీలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైద్యులు సమన్వయంతో పనిచేయాలి

డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌

సుజాతనగర్‌: వైద్యులు సమన్వయంతో పని చేసి బాధితులకు ఉత్తమ సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ సూచించారు. స్థానిక పీహెచ్‌సీని గురువారం తయన తనిఖీ చేశారు. మిషన్‌ హెల్త్‌–100 ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్‌ హెల్త్‌–100 కార్యక్రమంపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి వైద్య కేంద్రంలో ఫ్యామిలీ ప్లానింగ్‌ కార్నర్‌ను బలోపేతం చేసి, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అన్ని ఆరోగ్య సూచికలను మెరుగుపరచే దిశగా కృషి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి, మిషన్‌ హెల్త్‌–100 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి మృతి

టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గోనెల విజయలక్ష్మి(79) గురువారం గుండెపోటుతో పాల్వంచలో మృతి చెందారు. ఆమె మృతదేహన్ని స్వగ్రామమైన టేకులపల్లి మండలం ప్రెగళ్లపాడు పంచాయతీ పరిధి తెలుగూరుకు తీసుకొచ్చారు. కాగా, విజయలక్ష్మి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 2006లో టేకులపల్లి జెడ్పీటీసీగా ఆమె గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ – సీపీఎం కూటమికి సమానంగా సీట్లు రావడంతో టాస్‌ ద్వారా విజయలక్ష్మికి చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. ఆమె భర్త వెంకటనారాయణ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగారు. ప్రత్యర్థుల చేతిలో ఆయన 1991లో హత్యకు గురయ్యారు.

రేషన్‌ డీలర్‌పై

కేసు నమోదు

జూలూరుపాడు: మండలంలోని సురారం రేషన్‌ డీలర్‌పై సివిల్‌ సప్‌లై అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం లేదనే ఫిర్యాదు మేరకు డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్‌ ఆదేశాలతో సివిల్‌ సప్లయ్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయకుండానే 12 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఏసీఎస్‌ఓ వరదరాజులు మాట్లాడుతూ.. ప్రతీ నెల 78.10 క్వింటాళ్ల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఫిబ్రవరి 28న రేషన్‌ దుకాణానికి మొత్తం బియ్యం వచ్చాయని, మార్చి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా 5వ తేదీ వరకు కూడా సరఫరా చేయలేదని వివరించారు. అయతే ప్రస్తుతం వచ్చిన 78.10 క్వింటాళ్ల సన్న బియ్యంతోపాటు, గతంలో నిల్వ ఉన్న 10.96 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలకు గాను 77.06 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. డీలర్‌ భీముడుపై కేసు నమోదు చేసి, ప్రస్తుతానికి సురారం రేషన్‌ షాపు నిర్వహణ బాధ్యతను కాకర్ల రేషన్‌ డీలర్‌కు అప్పగించామని తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో భద్రాచలం సివిల్‌ సప్‌లై డీటీ జి.రాజులు, ట్రైనీ డీటీ వడ్డె భార్గవ్‌, ఆర్‌ఐ ఎన్‌.వెంకట్వేర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement