● వనం రాకతో నిండు జాతర ప్రారంభం ● పోటెత్తిన భక్తజనం
గుండాల: డోలీ చప్పుళ్లు.. భక్తుల నృత్యాలు.. పూనకాల నడము వన దేవత సమ్మక్క తల్లి గద్దైపెకి రావడంతో జాతర పరిపూర్ణత సంతరించుకుంది. ముందురోజు పగిడిద్దరాజు గద్దెలపైకి రాగా మొక్కుల చెల్లింపులు జోరందుకున్నాయి. వడ్డెలు, పూజారులు వనాన్ని గద్దైపె ప్రతిష్ఠించడంతో నిండుజాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర గురువారం అంగరంగ వైభవంగా సాగింది. అరెం వంశీయులు పూజలతో వన దేవతలకు స్వాగతం పలికారు. గుట్ట నుంచి వనం తీసుకవస్తూ మార్గ మధ్యంలో పగిడిద్దరాజు – సమ్మక్క దేవతలకు ఎదురిళ్లు కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఇలవేల్పులను గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజారులు, వడ్డెలు, తలపతులు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు జోగు నిర్వహించి, రాత్రి 8 గంటలకు దేవతలకు గంగాస్నానం చేయించి గుడి నింపారు. వన దేవతలను గద్దెల వద్దకు చేర్చే క్రమంలో వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవతలను తీసుకొస్తుండగా పూజారులు, భక్తులు మంటలపై నుంచి నడిచివచ్చారు. దారి పొడవునా డోలి వాయిద్యాలు, ఆదివాసీల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పగిడిద్దరాజు జాతరకు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దేవతలను దర్శించుకున్న భక్తులు బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లు, మేకలు బలిచ్చారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండాల సీఐ తిరుపతి, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. మేడారం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్ ఇర్ప సుకన్య, మాజీ చైర్మన్ అరెం లచ్చు పటేల్ పగిడిద్దరాజు – సమ్మక్క దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అర్రెం అప్పయ్య, లక్ష్మీనర్సు, పెద్ద కాంతారావు, చిన్న కాంతారావు, నాగేశ్వరరావు, బిక్షం, లక్ష్మీనారాయణ, సత్యం, సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


