దుమ్ముగూడెంలో పర్యటన
● భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ‘నీతి ఆయోగ్’ ● మాతా, శిశు మరణాల తగ్గింపు చర్యలు భేష్ అంటూ ప్రశంస
భద్రాచలంఅర్బన్ : ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నీతి ఆయోగ్ బృందం సభ్యులు వైద్యులకు సూచించారు. గురవారం వారు భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఎస్‌ఎన్‌సీయూ వార్డులో నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యం, వారి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. మాతా, శిశు మరణాల రేటు తక్కువగా ఉండడాన్ని గమనించి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. జిల్లాలోని ఇతర ఆస్పత్రుల కంటే భద్రాచలంలో పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్‌లోనూ ఇలాగే పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ కన్సల్టెంట్ ఉమాంగ్ కటోచ్, అసిస్టెంట్ కన్సల్టెంట్ నవనీత్, మైనార్టీ అధికారి సంజీవరావు, ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : మండలంలోని పర్ణశాల టీబీ ఆస్పత్రి, దుమ్ముగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రం, నర్సాపురం జెడ్పీ పాఠశాలను నీతి ఆయోగ్ బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు పర్యటిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రిలో గల సౌకర్యాలపై ఆరా తీశారు. టీబీ పేషెంట్లకు సమయానుకూలంగా వైద్యం చేయాలని, సరిపడా మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు. అంగనవాడీ కేంద్రంలో చిన్నారులకు బలవర్థక ఆహారం అందించాలని చెప్పారు. నర్సాపురం పాఠశాలలో పిల్లల విద్యాభ్యాసాన్ని తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నీతి అయోగ్ ద్వారా ఈ పాఠశాలలో 54 మంది బాలబాలికలకు సైకిళ్లు అందజేశామని, వాటిని సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం సీడీపీఓ జ్యోతి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి పుల్లారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీధర్, పర్ణశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేణుకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


