హత్యకేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితుల అరెస్టు

Mar 6 2026 8:23 AM | Updated on Mar 6 2026 8:23 AM

● వ్యక్తిగత కక్షలతోనే దారుణం ● వివరాలు వెల్లడించిన ఏడూళ్ల బయ్యారం సీఐ

● వ్యక్తిగత కక్షలతోనే దారుణం ● వివరాలు వెల్లడించిన ఏడూళ్ల బయ్యారం సీఐ

కరకగూడెం: మండలంలోని అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామంలో గత నెల 28న అర్ధరాత్రి జరిగిన సీపీఎం నేత కొవ్వాసి వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన కరకగూడెం పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో అశ్వాపురంపాడుకు చెందిన వజ్జ భీమరాజు, మడివి మంగయ్య, మడివి నందయ్యతో పాటు, హత్యకు సహకరించిన వంకా బాలాజీ (సారపాక), మడకం లక్ష్మయ్య (తాళ్లగొమ్మూరు)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హత్య జరిగిన వెంటనే మృతుడి భార్య సునీత.. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు గ్రామంలో విచారణ చేపట్టగా ఘటన సమయంలో గ్రామంలోకి కొత్త వ్యక్తులు రావడం, కొందరి కదలికలు అనుమానాస్పదంగా ఉండడాన్ని పోలీసులు గమనించారని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారని, ఆ తర్వాత విచారణలో నేరాన్ని అంగీకరించారని తెలిపారు.

రూ.50 వేల సుపారీ ఇచ్చి..

నిందితుడు భీమరాజు గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లినప్పుడు మృతుడు వెంకటేశ్వర్లు అతడికి బెయిల్‌ రాకుండా అడ్డుకున్నాడని కోపం పెంచుకున్నాడు. మరో నిందితుడు మంగయ్య కుటుంబ విషయాల్లో తలదూర్చి అతడి భార్యలను విడగొట్టేలా వెంకటేశ్వర్లు ప్రవర్తిస్తున్నాడని భావించాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు అడ్డు తొలగించుకోవాలని భీమరాజు తన ముఠాతో కలిసి నిర్ణయించుకున్నాడు. అతడికి జైలులో పరిచయమైన బాలాజీకి రూ.50 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని, అతడి స్నేహితుడు లక్ష్మయ్యతో కలిసి పథకం వేశారు. ఫిబ్రవరి 28న అర్ధరాత్రి నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. విచారణ అనంతరం నిందితుల నుంచి హత్యకు వాడిన గొడ్డలి, రక్తపు మరకలున్న బట్టలు, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సైలు పీవీఎన్‌.రావు, సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement