చండ్రుగొండ: మండల కేంద్రమైన చండ్రుగొండలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనగా.. ఒక లారీ డ్రైవర్ మృతి చెందాడు. మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి 108 ఆంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ప్‌లైవుడ్ లోడుతో తమిళనాడు నుంచి రాయపూర్ వెళ్తున్న లారీ, భద్రాచలం నుంచి విజయవాడ వైపు తవుడు లోడుతో వెళ్తున్న లారీ చండ్రుగొండలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాయపూర్ వెళ్తున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు లారీల ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. ఎస్‌ఐ శివరామకృష్ణ, సిబ్బంది స్థానికుల సాయంతో వారిని బయటకు తీసి కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రామ్మూర్తి(42) మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి గురైన లారీలు రోడ్డుకు అడ్డుగా ఉండటంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఎస్‌ఐ, సిబ్బంది రెండు జేసీబీలతో లారీలను పక్కకు జరిపించి రెండు గంటల పాటు శ్రమించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.


