సూపర్‌బజార్(కొత్తగూడెం): నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రోహిత్‌రాజ్ సైతం సంబరాల్లో పాల్గొని జోష్ నింపారు. మొదట జిల్లా పోలీస్ అధికారులంతా కలిసి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి హోలీ వేడుకలకు రావాలని ఎస్పీని ఆహ్వానించారు. అక్కడ అధికారులు, సిబ్బంది రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. అనంతరం ఎస్పీతో కలిసి అధికారులంతా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుని బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అధికారులు, సిబ్బంది తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్‌కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్నబాబు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


