ఇల్లెందు: భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఇల్లెందుకు చెందిన బి.రాంసింగ్ నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మధార్, ఉపాధ్యక్షుడిగా కె.భాస్కర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా జి.నరసింహ, కోశాధికారిగా ఎన్.సురేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులుగా దుర్గా ప్రసాద్, మూతి రాంబాబు, లింగ్యా, సనప రాంబాబు, కె కృష్ణ, కాంతారావు ఎన్నికయ్యారు.
ట్రాన్స్‌ఫార్మర్లలో
కాపర్ వైరు చోరీ
పాల్వంచరూరల్: ఒకేరోజు రాత్రి నాలుగు గ్రామాల్లోని నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పునుకుల, నాగారం, తోగ్గూడెం, జగన్నాధపురం గ్రామాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను గతనెల 27న దుండగులు ధ్వంసం చేసి సుమారు 40 కిలోల కాపర్‌వైర్లను ఎత్తుకెళ్లారు. దాని విలువ రూ.20వేలకు పైగానే ఉంటుందని విద్యుత్‌శాఖ రూరల్ ఏఈ రవీందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ వెల్లడించారు.
చిన్న బాబుకు పెద్ద కష్టం..
వైద్యం చేయించలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు
అశ్వాపురం: మండల పరిధిలోని అమ్మగారిపల్లి పంచాయతీ కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన పాయం నరసింహారావు, రాధ దంపతుల కుమారుడు తేజరిత్విక్ చిన్న వయస్సులోనే పెద్ద జబ్బుతో బాధపడుతున్నాడు. రెండేళ్ల చిన్నారికి ఉపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకగా 10 రోజుల క్రితం మణుగూరులో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్యం విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కూలీ నాలి చేసి పొట్టగడుపుకునే నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు డబ్బులు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థల వారు స్పందించి తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని ఆ దంపతులు కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు 8897728091 (పాయం నరసింహారావు) నంబర్‌కు ఫోన్ పే చేయాలని వేడుకుంటున్నారు.
చిన్నారిపై అత్యాచార
యత్నం : పోక్సో కేసు
ఏన్కూరు: చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిపై పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఏన్కూరులోని ఓ కాలనీకి చెందిన ఆరున్నర సంవత్సరాల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన వీరభద్రం ఇంట్లో ఎవరూ లేని సమయాన అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో చిన్నారి గట్టిగా రోదిస్తూ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఘటనపై పాప కుటుంబీకుల ఫిర్యాదుతో వీరభద్రంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్.సంధ్య తెలిపారు.
తప్పుడు పత్రాలతో
ప్లాట్ల అమ్మకం
ఖమ్మంఅర్బన్: నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్మి తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం బల్లేపల్లి ప్రాంతంలో 200 గజాల చొప్పున రెండు ప్లాట్లను వి.వెంకట్‌రెడ్డి, టి.వెంకటేశ్వర్లు తప్పుడు డాక్యుమెంట్లతో తనకు అమ్మారని రావుల అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నాడు. ప్లాట్‌లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం మున్సిపల్ కార్పొరేషన్‌లో దరఖాస్తు చేసుకోగా తప్పుడు డాక్యుమెంట్లుగా తేలిందని తెలిపారు. ఈమేరకు అనిల్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.


