ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): సుప్రసిద్ధ బాలాజీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణ వేడుక తేదీలో నెలకొన్న మీమాంస జాతరపై తీవ్ర ప్రభావం చూపింది. సహజంగా ప్రతీ సంవత్సరం హోలీ రోజున స్వామివారి కల్యాణ క్రతవు నిర్వహిస్తారు. ఈ క్రమంలో రంగుల పండుగ రోజునే తిరుకల్యాణం, మహాజాతర అంటూ అన్నివర్గాల్లోనూ నాటుకుపోయింది. అయితే ఈ ఏడాది చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే కల్యాణం జరిపించడం, ఈ విషయమై తగిన ప్రచారం కల్పించకపోవడంతో భక్తుల రాకపై ప్రభావం చూపింది. ఎప్పుడూ వచ్చే సంఖ్యలో కనీసం సగం మంది కూడా హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఇక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమైన ఫిబ్రవరి 28వ తేదీనే ఆలయ మేనేజర్ పాకాల వెంకటరమణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. గతంలో కనీసం రెండు వారాల ముందు నుంచే కరపత్రాల పంపిణీ, గ్రామాల్లో ఆటోల్లో మైక్ ప్రచారం చేసేవారు. ఈ దఫా ఇంటింటి ప్రచారం నామమాత్రంగా సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాథాన్యత కలిగిన ఎదుర్కోలు వేడుక సమమంలో మైక్‌లు సరిగా పనిచేయకపోవడంతో భక్తులు అమోయమానికి గురయ్యారు. ఈ విషయమై ఆలయ మేనేజర్ వెంకటరమణను వివరణ కోరగా.. స్వామివారి తిరుకల్యాణానికి భక్తులు తగ్గిన మాట వాస్తవమేనని, హోలీ రోజునే కల్యాణం నిర్వహిస్తారని ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని చెప్పారు. అయితే గ్రహణం ఉండడంతో ముందే నిర్వహించాల్సి వచ్చిందన్నారు. శక్తి మేరకు విసృతంగా ప్రచారం చేపట్టామని, ఆరువేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయగా,నాలుగు వేల మంది వరకు వచ్చారని తెలిపారు.
ప్రచార లోపమే కారణమా ?


