పాల్వంచ: పాల్వంచ నవభారత్ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ లిమిటెడ్ ఉద్యోగి దుర్మరణం చెందగా.. హోలీ పండుగ రోజున కుటుంబంలో విషాదం అలముకుంది. స్థానిక శ్రీనగర్ కాలనీకి చెందిన మాచర్ల ఉమా మహేశ్వరరావు(40) నవ లిమిటెడ్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తు అక్కడే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం తోటి ఉద్యోగితో కలిసి ఉమా మహేశ్వరరావు కూరగాయలు కొనేందుకు నవభారత్ సెంటర్‌కు బయలుదేరాడు. సెంటర్‌లో యూటర్న్ తీసుకుంటుండగా ఇల్లెందు మండలం ధనియాలపాడుకు చెందిన జబ్బా ప్రశాంత్ పల్సర్ బైక్‌పై అతివేగంగా వచ్చి వీరి మోటర్ సైకిల్‌ను ఢీ కొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న ఉమా మహేశ్వరరావు ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తోటి ఉద్యోగి దుర్గాప్రసాద్, ప్రశాంత్‌తో పాటు అతడి బైక్‌పై కూర్చున్న మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
ప్రమాద జోన్‌గా నవభారత్ సెంటర్
ఇటీవల పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా నవభారత్ సెంటర్ ప్రమాదభరితంగా మారింది. ఈ సెంటర్‌లోనే యూటర్న్ పాయింట్ ఉండడం, రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రద్దీగా మారింది. ఈ రహదారిపై వాహనాల రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఇక్కడ ప్రమా ద సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పండుగపూట విషాదం
మణుగూరు టౌన్: మణుగూరు ము న్సిపాలిటీ పరిధిలోని మల్లెపల్లి సమీపంలో హోలీని పురస్కరించుకుని గోదావరి వద్ద స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకు న్న సీఐ నాగబాబు, ఎస్‌ఐ శ్రావణ్ ఘట నా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించగా.. గుండి నాగేశ్వరరావు, పద్దం ప్రసాద్ గల్లంతయినట్లు తెలిసింది. వారి ఆచూకీ కోసం పడవలో తిరుగుతూ గాలింపు చర్యలు చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఇల్లెందురూరల్: భూ ఆక్రమణపై ప్రశ్నించినందుకు దాడిచేసి కులం పేరుతో దూషించినట్లు వచ్చిన ఫిర్యాదుతో ముద్దుంగుల సాందయ్య, లక్ష్మి, సతీష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ మంగవారం తెలిపారు. తిలక్‌నగర్‌కు చెందిన చింతల సరోజకు చెందిన భూమిని కొంత ఆక్రమించుకొని భూపేష్‌నగర్‌కు చెందిన పై ముగ్గురు సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమ నెలకొల్పారు. సదరు భూమి ఆక్రమణపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధితురాలు సరోజ ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.


