ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్‌ తనిఖీ

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

పాల్వంచరూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, కస్తూర్బా గాంధీ స్కూల్‌ ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ అంకిత్‌ సోమవారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో లైటింగ్‌, ఫ్యాన్లు, తాగునీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలను పరిశీలించారు.

విద్యార్థిని ఆలస్యంగా రావడంతో..

ఇంటర్మీడియట్‌ పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థినిని పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. పాల్వంచ పట్టణంలోని కస్తూర్బా గాంధీ స్కూల్‌ కేంద్రంలో మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని సోమవారం పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చింది. అప్పటికే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేశారు. పరీక్షకు ఉదయం 9.15 గంటల వరకు అనుమతి ఉందని, విద్యార్థిని 10.15 గంటలకు రావడంతో అనుమతించలేదని చీఫ్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

దుబాయ్‌లో

మంత్రి తుమ్మల..

అక్కడి పరిస్థితులతో

తిరుగు ప్రయాణం ఒకరోజు వాయిదా

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. గతనెల 22న ఆయన అల్లుడు డాక్టర్‌ కల్యాణ్‌శేఖర్‌ వైద్యుల సదస్సు నిమిత్తం దుబాయ్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో మంత్రి తుమ్మల తన కుమార్తె మోహిని, ఇతర కుటుంబీకులతో కలిసి 23వ తేదీన దుబాయ్‌ వెళ్లారు. అయితే, కళ్యాణ్‌శేఖర్‌ మరికొద్ది రోజులు అక్కడే చికిత్స పొందాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఇంతలోనే మంత్రి తుమ్మల ఈనెల 4న భారత్‌కు తిరుగు ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేసుకున్నా, అక్కడి పరిస్థితుల కారణంగా విమానం రద్దవడంతో టికెట్‌ను ఈనెల 5వ తేదీకి మార్పు చేసినట్టు క్యాంప్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంత్రి దుబాయ్‌లో చిక్కుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదని, పరిస్థితుల దృష్ట్యా ప్రయాణం వాయిదా పడిందే తప్ప ఇబ్బందులు లేవని తెలిపారు.

రైలులో

జార్ఖండ్‌ వాసి మృతి

ఖమ్మంక్రైం: బెంగళూరు నుంచి జార్ఖండ్‌ వెళ్తున్న వ్యక్తి రైలులో మృతి చెందాడు. జార్ఖండ్‌లోని పాలము జిల్లా సరాహువాకు చెందిన మహేష్‌ దేవర్‌(40) పొట్టకూటి కోసం కొన్నాళ్ల క్రితం బెంగళూరు వెళ్లాడు. అక్కడి కూలీ పనులతో జీవనం సాగిస్తుండగా అనారోగ్యం బారిన పడడంతో సహచరులు జార్ఖండ్‌ వెళ్లేందుకు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎక్కించారు. మార్గమధ్యలోనే మహేష్‌ తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆయన సహచరులు ఇచ్చిన సమాచారంతో రైలు ఖమ్మం స్టేషన్‌కు అర్థరాత్రి చేరుకునే సరికి జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, 108 సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే, మహేష్‌ను పరీక్షించిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్నేహితులు సోమవారం స్వస్థలానికి తీసుకెళ్లారు.

విద్యుత్‌ వ్యవస్థ రక్షణకు లైట్నింగ్‌ అరెస్టర్లు

ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చినప్పడు విద్యుత్‌ వ్యవస్థను రక్షించేలాచర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్‌ లైన్లు, పంపిణీ వ్య వస్థ, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ స్టేషన్లు, ఇతర పరికరా లు నష్టపోకుండా లైట్నింగ్‌ అరెస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు సర్కిల్‌ పరిధిలో 109 లైట్నింగ్‌ అరెస్టర్లను అమర్చగా, ఇవి మెరుపు, పిడుగు సమయాన కలిగే అధిక వోల్టోజీని భూమిలోకి పంపిస్తాయని తెలిపారు.

సింగరేణి ఉద్యోగులకు పదోన్నతులు

సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీ ఉద్యోగులు పలువురికి పదోన్నతులు కల్పించారు. హెడ్‌ ఓవర్‌మెన్‌ గ్రేడ్‌–ఏ నుంచి గ్రేడ్‌–ఏ1గా ఐదుగురికి, గ్రేడ్‌–బీ నుంచి గ్రేడ్‌–ఏలోకి ఏడుగురికే కాక టైం రెటెడ్‌ వేకెన్సీలను ద్వారా ఐదుగురికి పదోన్నతి దక్కింది. అలాగే, కెరీర్‌ గ్రోత్‌ స్కీం ద్వారా కిష్టారం ఓసీలో ఒకరికి, జేవీఆర్‌ ఆర్‌సీహెచ్‌పీలో మెకానికల్‌ గ్రేడ్‌–బీ నుంచి గ్రేడ్‌–ఏ ఇంకొకరికి పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఉద్యోగులకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ పదోన్నతి పత్రాలు అందజేశారు. పీఓ ప్రహ్లాద్‌, ప్రాజెక్టు అధికారులు డి.శ్రీనివాసరావు, బి.రాజేశ్వరరావు, జి.కళ్యాణ్‌రామ్‌, నాయకులు సుధాకర్‌, బి.కోటేశ్వరరావు, నర్సింహారావు, కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement