‘ఉడుములబండ’లో పోడు వివాదం | - | Sakshi
Sakshi News home page

‘ఉడుములబండ’లో పోడు వివాదం

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

జేసీబీలను అడ్డుకున్న

పోడు సాగుదారులు

అటవీ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం

ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలు

అశ్వారావుపేటరూరల్‌: పోడు భూముల విషయంలో సోమవారం అటవీశాఖ అధికారులు, పోడు సాగుదారులకు మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు గిరిజనులు స్వల్పంగా గాయపడ్డారు. అశ్వారావుపేట మండలం, దమ్మపేట ఫారెస్టు రేంజ్‌లోని దురదపాడు బీట్‌ ఉడుములబండ గ్రామ శివారులో గడిచిన 30 ఏళ్లుగా 28 గిరిజన, వలస ఆదివాసీ కుటుంబాలు 300 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నాయి. వీరిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 30 ఎకరాలకు పోడు పట్టాలు అందించారు. మిగిలిన వారికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సర్వే చేసినా పోడు పట్టాలు రాలేదు. ఈ క్రమంలోనే కొందరు గిరిజనేతరులు పోడు వ్యవసాయంపై అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోడు పట్టాలు లేని భూముల్లో ప్లాంటేషన్‌ పనులు చేపట్టేందుకు సోమవారం దమ్మపేట ఫారెస్టు రేంజ్‌ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో జేసీబీలతో తరలివచ్చారు. పోడు భూముల్లో కందకాలు తీసేందుకు అటవీ అధికారులు యత్నించడంతో అక్కడికి చేరుకున్న పోడు సాగుదారులు అడ్డుకున్నారు. జేసీబీలను ముట్టడించడంతో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో గిరిజనులు కణితి కన్నయ్య, మల్లేష్‌, సుబ్బారావుకు తీవ్రగాయాలు కాగా, చంద్రమ్మ, నాగమణి, ఝాన్సీ, గంగరాజులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, పోడు సాగుదారులపై అటవీ అధికారులు దాడులకు పాల్పడటంతో తగదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి దాడులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement