షార్ట్ సర్క్యూట్‌తో బడ్డీకొట్టు దగ్ధం
కొణిజర్ల: షార్ట్ సర్క్యూట్‌తో బడ్డీ కొట్టు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొణిజర్లకు చెందిన గొడ్డుగొర్ల నవ్య తన తల్లితో కలిసి ఎస్సీకాలనీ సమీపంలో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నది. శనివారం
దుకాణం మూసి ఇంటికి వెళ్లగా రాత్రి 11.30 సమయంలో దుకాణం నుంచి మంటలు, పొగ కనిపించడంతో పక్కింటి వారు నవ్యకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా కిరాణా సరుకులు, ఫ్రిజ్, రూ.7 వేలు నగదు కాలిపోయాయని నవ్య వాపోయింది. సర్పంచ్ చింతల పుష్పావతి ఉపేందర్, మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు తదితరులు దుకాణాన్ని సందర్శించారు. నవ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అడవిపంది మాంసం స్వాధీనం
కామేపల్లి: ముచ్చర్ల రామస్వామి గుట్ట సమీపంలో అడవి పంది మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఆముదాల కృష్ణయ్య, వెంకటేశ్వర్లు వద్ద ఎనిమిది కేజీల అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లగూడెం సెక్షన్ ఆఫీసర్ శిల్ప తెలిపారు.


