సీపీఎం నేత దారుణ హత్య..
● కత్తితో పొడిచి హతమార్చిన గుర్తు తెలియని దుండగులు ● గ్రామంలో పోలీసుల మోహరింపు
కరకగూడెం: మండలంలో వలస ఆదివాసీ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఆదివారం కరకగూడెం మండలం పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పోలీసుల ఇలా వివరించారు. మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కొవ్వాసి వెంకటేశ్వర్లు (50) సుమారు 20 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ పోడుభూమి కొట్టి వ్యవసాయం చేసుకుంటూ, కూలిపనులు చేస్తూ భార్య, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. ఆయన స్థానికంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లును కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్ల డించారు. ఈ మేరకు కరకగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పీ.వీ.ఎన్.రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
పోలీస్ బందోబస్తు..
హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో హత్య ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు. కాగా, విషయం తెలుసుకున్న మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు వ్యక్తిగత కక్షలేమైనా కారణమా లేదా ఇతర కోణాలేమైనా ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


