ఫైర్‌లైన్లకు పైసల్లేవ్!
ఫైర్ వాచర్ల కొరత
నివారణ చర్యలు తీసుకుంటున్నాం
● వేసవిలో అగ్నిప్రమాదాలతో వనాలకు ముప్పు ● నిధుల్లేక ఫైర్‌లైన్లు ఏర్పాటు చేయని అధికారులు ● అటవీశాఖ ఫైర్ బ్లో బృందాలతో కొంత మేలు
పాల్వంచరూరల్: అటవీ ప్రాంతంలో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరకుండా అటవీశాఖ ఫైర్‌లైన్స్ ఏర్పా టు చేయడంతోపాటు బ్లోయర్లను వినియోగిస్తుంది వేసవి ప్రారంభానికి ముందే ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, క్యాంపా నిధులులేని కారణంగా అటవీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఫైర్‌లైన్స్ ఏర్పాటుకు ముందుకు రావడంలేదు. వైల్డ్‌లైఫ్ డివిజన్‌లో మాత్రం ఇతర నిధులను ఖర్చుచేసి నూతనంగా 50 కిలోమీటర్ల దూరం విస్తీర్ణంలో ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్‌డీఓ బాబు తెలిపారు.
637 చదరపు కిలోమీటర్లలో
దట్టమైన అడవి
జిల్లాలోని దట్టమైన అడవి 637.34 చదరపు కిలోమీటర్లు, మధ్యస్థాయి 1.502,71 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. 6 డివిజన్లు, 24 రేంజ్‌లు, 944 బీట్లతో అటవీశాఖ సంరక్షణ చర్యలు చేపడుతోంది. వేసవిలో చెట్ల ఆకులు నేలరాలుతాయి. అడవిలోకి వెళ్లిన వారు బీడీలు, చుట్టలు, సిగరెట్లు కాల్చివేయడం ద్వారా ఎండిన ఆకులకు నిప్పు అంటుకుని అగ్ని ప్రమాదాలు సంభవించి అడవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వీటి నివారణకు ప్రత్యేక ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
జిల్లాలో అధికంగా, తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను అటవీశాఖ గుర్తించింది. గుండాల, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, చర్ల, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 2024–2025 సంవత్సరంలో 122.65 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్ల విస్తరణకు రూ.19.45 లక్షలు ఖర్చు చేశారు. 2025–2026లో 479 కిలోమీటర్ల ఫైర్‌లైన్స్ ఏర్పాటుకు రూ.55.60 లక్షలు వ్యయం చేశారు. అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాల నివారణకు ఏటా ఏర్పాటు చేస్తున్న ఫైర్‌లైన్స్ పనులతో వెయ్యి మంది గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. దాదాపు నెలరోజులపాటు పనులు చేపడతారు. కానీ ఈ ఏడాది ఫైర్‌లైన్స్ ఏర్పాటుకు రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో అటవీ సంరక్షణకు ప్రమాదం ఏర్పడటంతోపాటు గిరిజనులు ఉపాధి కూడా కోల్పోయినట్లయింది. అయితే డివిజన్‌కు మూడు బృందాల చొప్పున జిల్లాలోని ఆరు డివిజన్లలో 18 ఫైర్ బ్లో బృందాలను అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు సిబ్బంది ఉంటారని అధికారులు తెలిపారు.
వేసవికాలంలో అడవులకు నిప్పు అంటుకుని ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు సమాచారం ఇచ్చేందుకు ఏటా అటవీశాఖ బీట్ల వారీగా ఫైర్ వాచర్లను నియమిస్తుంది. నిధుల్లేని కారణంగా ఈ ఏడాది ఫైర్‌వాచర్లను నియమించలేదు. దీంతో అగ్నిప్రమాదం సంభవిస్తే సమాచారం అందే అవకాశం లేక అటవీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాగా, క్యాంపా పథకం నిధులు లేకపోవడంతో కొత్త స్కీమ్ వస్తే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులు నిరీక్షిస్తున్నారు.
జిల్లా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పట్టిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించే ఐదు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాం. డివిజన్‌కు మూడు చొప్పున ఫైర్ బ్లోయర్లను అందించాం. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం.
–కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి
ఫైర్‌లైన్లకు పైసల్లేవ్!
ఫైర్‌లైన్లకు పైసల్లేవ్!


