డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
● మరో నలుగురికి జరిమానా విధింపు
అశ్వారావుపేటరూరల్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష, మరో నలుగురికి జరిమానా విధించారు. స్థానిక ఎస్‌ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేటకు చెందిన కళ్లేపూడి అశోక్, మరో నలుగురు మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. వారిపై కేసులు నమోదు చేసి శుక్రవారం దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.భవానీరాణి ఎదుట హాజరు పరిచగా.. అశోక్‌కు ఆరు రోజుల జైలు శిక్ష, మిగిలిన నలుగురికి ఒకొక్కరికీ రూ.10 వేలు చొప్పున మొత్తం జరిమానా విధించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
చెల్లని చెక్కు కేసులో రెండేళ్ల జైలు
ఖమ్మంలీగల్: ఓ వ్యక్తి అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన గొర్రె సతీశ్ వద్ద భద్రాద్రి జిల్లా కొత్త గొల్లగూడెంనకు చెందిన గోసు నాగభూషణం 2019 అక్టోబర్‌లో రూ.8 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2021 అక్టోబర్‌లో రూ.9.50లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురయ్యాడు. దీంతో సతీశ్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం నాగభూషణంకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి పరిహారం చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.
వ్యక్తికి మూడు రోజుల జైలు
ఇల్లెందు: మద్యం సేవించి ఆటో నడిపిన కేసులో ఇల్లెందు పట్టణానికి చెందిన కట్టబోయిన ప్రవీణ్‌కు ఇల్లెందు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి.ఇందిర మూడు రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఇల్లెందుకు చెందిన ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడుపుతూ టేకులపల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. వారు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
దుమ్ముగూడెం: మండలంలోని మారేడుబాక ఎంపీపీఎస్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేశారు. అందులో 8 మందికి కడుపునొప్పి, వాంతులు కావడంతో హుటాహుటిన నర్సాపురం వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం ఇళ్లకు పంపించారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పరీక్షించగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్ సుభాష్ తెలిపారు.
ఏసీబీ తనిఖీలు
వైరా: వైరాలోని మత్స్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఉద్యోగుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే ఫిర్యాదులతో తనిఖీకి వచ్చామని ఏసీబీ డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. ఉదయాన్నే చేరుకున్న అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకోవడమే కాక రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగించారు. డీఎస్పీ మాట్లాడుతూ 2022లో మత్స్యశాఖ సొసైటీల నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అప్పటి ఎఫ్‌డీఓ బుచ్చి బాబు పట్టుబడ్డాడని, ఆనాటి రికార్డులతో పాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వైరా ఎఫ్‌డీఓ కార్యాలయం కింద 55 సొసైటీలు ఉండగా పర్యవేక్షణ లోపం, రికార్డుల్లో అవకతవకలను గుర్తించామని తెలిపారు.


