మొర్రేడు వాగులో జేసీబీ సీజ్
పాల్వంచరూరల్: మండల పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధి భోజ్యాతండా సమీపంలో మొర్రేడు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు వినియోగిస్తున్న జేసీబీని గురువారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మొర్రేడు వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ‘మొర్రేడు ఖాళీ’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. మొర్రేడువాగులో ఉన్న జేసీబీని స్వాధీనం చేసుకుని, జరిమానా విధిస్తామని తహసీల్దార్ దారా ప్రసాద్ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష
టేకులపల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ ఆటో డ్రైవర్‌కు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. మద్యం తాగి ఆటో నడిపిన కేసులో ఇల్లెందు పట్టణానికి చెందిన కట్టబోయిన ప్రవీణ్‌కు ఇల్లెందు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి.ఇందిర శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించారు. ఈ మేరకు ఎస్‌ఐ రాజేందర్ వివరాలు వెల్లడించారు.
రూ. 2 లక్షల సొత్తు చోరీ
చర్ల: మండలంలోని కుదునూరులో గురువారం మధ్యాహ్నం రూ. 2 లక్షల విలువైన సొత్తు చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కాశిమల్ల సుధాకర్ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్.కొత్తగూడెంలోని బ్యాంకు వద్దకు వెళ్లగా భార్య గ్రామంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలకు వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగుల గొట్టి రూ.10 వేల నగదు, రూ 1.50 లక్షల విలువైన 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి పట్టీలను అపహరించుకుపోయారు. సీఐ ఎ.రాజువర్మ కుదునూరుకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.


