నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
ఖమ్మంమయూరిసెంటర్: వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారందరికీ ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేసేంత వరకు పునరావాస కేంద్రాలు నిర్వహించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ భవన్‌లో ఉన్న వెలుగుమట్ల నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం వెలుగుమట్ల ప్రాంతంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రతీ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని, ఇళ్ల కూల్చివేతకు గురైన కుటుంబాలకు ఎటువంటి షరతులు లేకుండా అదే స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శులు దండి సురేష్, నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, వామపక్ష పార్టీల నాయకులు వై.విక్రమ్, శింగు నర్సింహారావు, సీ.వై.పుల్లయ్య, సీహెచ్.శిరోమణి, మేకల శ్రీనివాసరావు, యర్రా శ్రీనివాసరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


