దర్శన భాగ్యం దక్కేనా? | - | Sakshi
Sakshi News home page

దర్శన భాగ్యం దక్కేనా?

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

దర్శన భాగ్యం దక్కేనా?

దర్శన భాగ్యం దక్కేనా?

కనులారా చూడలేదనే అసంతృప్తి..

వీవీఐపీ, వీఐపీ గ్యాలరీల్లో మార్పులు

‘ఉభయదాతల’ ఇబ్బందులకు చెక్‌

సామాన్య భక్తులకు మాత్రం తప్పని ఇక్కట్లు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమికి భద్రాచలం వచ్చే భక్తులకు సీతారాముల కల్యాణం కనులారా వీక్షించే అవకాశం కల్పించే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు నవమికి సంబంధించిన ఏర్పాట్లలో వేగం పెంచింది.

కల్యాణం చూసేది ఇలా..

వచ్చే నెల 27వ తేదీ శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను భక్తులు స్వయంగా తిలకించేందుకు వీలుగా ఆలయం వెలుపల ఉన్న మిథిలా స్టేడియంలో వివాహ తంతు జరిపిస్తారు. అందులో భాగంగా కల్యాణ మండపం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. సీఎం, మంత్రులు, జ్యుడీషియల్‌ విభాగానికి ఒక గ్యాలరీ, ఆ తర్వాత సిఫార్సు లేఖలతో వీఐపీలకు మరో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత సామాన్య భక్తుల కోసం ఉయభదాతలు (ఇద్దరికి కలిపి రూ.7500 టికెట్‌), రూ. 5,000, రూ. 2,000, రూ.500, రూ.250 చొప్పున టికెట్లు విక్రయిస్తారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు వీలుగా వీరందరికీ వేర్వేరు సెక్టార్లు కేటాయిస్తారు. ఈ సెక్టార్లకు ఆవల ఉచితంగా కల్యాణాన్ని తిలకించే అవకాశం భక్తులకు ఉంటుంది.

ఆ అడ్డంకులు లేకుండా

ఉభయదాతలకు ప్రతీసారి ఎదురువుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం ఎదురుగా నిర్మించిన భారీ షెడ్డు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ షెడ్డు పరిధిలోకి వచ్చే వీవీఐపీ, వీఐపీ, ఉభయదాతల సెక్టార్ల విభజనలో మార్పులు చేసే అవకాశం అధికార యంత్రాంగానికి దక్కింది. సీఎం, ఇతర ప్రముఖులకు సంబంధించిన గ్యాలరీకి మండపం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించనున్నారు. తర్వాత మిగిలిన ప్రదేశాన్ని అడ్డంగా కాకుండా నిలువుగా రెండు భాగాలుగా విభజించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అందులో ఒకకవైపు వీఐపీ గ్యాలరీ ఉంటే మరో వైపు ఉభయదాతల గ్యాలరీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తద్వార వీవీఐపీ, వీఐపీ వెనుకకాకుండా వారికి సమాంతరంగా కూర్చుని కల్యాణం చూసే అవకాశం ఉయభదాతలకు కలుగుతుంది.

టికెట్‌ కొన్నా.. తప్పని తిప్పలు

శ్రీరామనవమి టికెట్లలో అత్యంత ప్రీమియం కేటగిరికి చెందిన ఉభయదాతలే కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక వారి తర్వాత వచ్చే రూ.5,000, రూ.2,000, రూ.500, రూ 250 టికెట్లు కొన్న భక్తుల పరిస్థితి మరీ దారుణం. పేరుకే భద్రాచలం వచ్చినట్టు కానీ, మిథిలా స్టేడియంలో ఏ సెక్టార్‌లో కూర్చున్నప్పటికీ కల్యాణ మండపంలో సీతారాముల వివాహ వేడుకను సరిగా చూడలేని పరిస్థితి నెలకొంది. మిథిలా స్టేడియంలో నేల సమతలంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు భద్రాచలంలో వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో భక్తుల కోసం ఏర్పాటు చేసే చలువ పందిళ్లు దర్శనానికి అడ్డుగా నిలుస్తున్నాయి.

మిథిలా మారేదెప్పుడో..?

మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం, గ్యాలరీలకు మధ్య విజిబులిటీ (వీక్షణత) సరిగా ఉండదనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ ఈ లోపాన్ని సవరించే ప్రయత్నాలు జరగడం లేదు. ప్రతీసారి సీఎం గ్యాలరీ, వీవీఐపీల గ్యాలరీ ఏర్పాట్లపైనే అఽధికార గణం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ చేతులు దులుపుకుంటోంది. ఈసారి షెడ్డు అందుబాటులోకి రావడంతో ఉభయదాతల టికెట్లు కొన్నవారికి మేలు జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో భద్రాచలం వచ్చే భక్తులందరూ రామయ్య కల్యాణం కనులార చూసేలా మిథిలా స్టేడియంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

మండపానికి ఎదురుగా ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత వీవీఐపీ గ్యాలరీలో ప్రజాప్రతినిధులు కూర్చుంటారు. తర్వాత సిఫార్సు లేఖలతో రూ.500 టికెట్‌తో వీఐపీ పాస్‌ల గ్యాలరీ ఉంటుంది. దాని తర్వాత స్థలాన్ని రూ.7500 టికెట్లు కొనుగోలు చేసే ఉభయదాతల గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అత్యంత ఖరీదైన టికెట్‌ కొనుగోలు చేసినా తమకు దగ్గరి నుంచి కల్యాణం స్పష్టంగా చూసే అవకాశం కలగడం లేదనే అసంతృప్తి ప్రతీసారి ఉభయదాతల టికెట్లు ఉన్న వారి నుంచి వస్తోంది.

భద్రాద్రిలో మొదలైన శ్రీరామ నవమి ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement