ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి

ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి

● మేం అధికారంలోకి వచ్చాక ఇక్కడే గృహప్రవేశాలు ● తప్పు చేయకుంటే మంత్రులెందుకు రావడం లేదు ? ● వెలుగుమట్లలో పర్యటించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

మంత్రుల కన్నుపడింది..

● మేం అధికారంలోకి వచ్చాక ఇక్కడే గృహప్రవేశాలు ● తప్పు చేయకుంటే మంత్రులెందుకు రావడం లేదు ? ● వెలుగుమట్లలో పర్యటించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘ఎవరూ అధైర్యపడొద్దు.. ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి.. మీ కోసం బీఆర్‌ఎస్‌ కొట్లాడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన కాగితాలతో అవసరమైతే సుప్రీంకోర్టుకు పోదాం. అసెంబ్లీ, మండలిలో పోరాడుతాం.. మేం అధికారంలోకి రాగానే మళ్లీ ఇదే వెలుగుమట్లలో ఇళ్లు కట్టించి గృహప్రవేశం చేయిస్తామని కేసీఆర్‌ చెప్పమన్నారు’ అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ఖమ్మంఅర్బన్‌ మండలం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం అంబేద్కర్‌ భవన్‌లోని పునరావాస కేంద్రంలో ఉంటున్న వారితో కేటీఆర్‌ మాట్లాడారు.

ఐకమత్యంతో పోరాడండి..

ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందున ధైర్యంగా ఉండాలని కేటీఆర్‌ సూచించారు. వంద మందికి అక్కడో, ఇక్కడో స్థలాలు ఇస్తాం.. కేసీఆర్‌ కట్టించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామంటూ లాక్కెళ్లి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, మంత్రులు పిలిచి చిచ్చుపెట్టే ప్రయత్నం చేసినా ఐక్యంగా కొట్లాడి విజయం సాధించాలని సూచించారు.

మీకు అండగా ఉంటాం..

ఓపీడీఆర్‌ బాధ్యులు పట్టాలు ఇప్పించినా వారిని ప్రభుత్వం నానా మాటలు అంటోందని కేటీఆర్‌ తెలిపారు. బాధితులకు పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ రవిచంద్ర అండగా ఉంటారన్నారు. బుధవారమే తాము రావాలని ప్రయత్నించినా ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. పేదలకు భూములు దక్కేలా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని, శాసనసభ, మండలిలో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇక్కడి పేదలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీయే మొత్తం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.

మంత్రులు ఇక్కడికి రావాలి..

ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులు, కలెక్టర్‌ ఇక్కడికి రావాలని కేటీఆర్‌ సూచించారు. ఏ తప్పు జరగకపోతే వారే వచ్చి వివరించొచ్చు కదా అని ప్రశ్నించారు. ఆర్డీఓను ముందు పెట్టి ఇళ్లు కూలగొట్టించాక.. ఇప్పుడు మంత్రులందరూ మంచోళ్లంటూ ఆర్డీఓపై నెపం పెట్టి బదిలీ చేశారన్నారు. మంత్రులకు ధైర్యం ఉంటే, తప్పు చేయకపోతే ఎందుకు రావడం లేదో చెప్పాలని సూచించారు.

కన్నీరుమున్నీరైన బాధితులు

భూదాన్‌ భూముల్లో కూల్చివేతల ప్రాంతాన్ని కేటీఆర్‌ పరిశీలించి పలువురు మహిళలతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా వేలాదిమంది పోలీసులతో వచ్చి బెదిరించి ఖాళీ చేయించారని వారు వాపోయారు. నిలువ నీడ లేక మాడిపోతున్నామని, గూడు లేకపోవడంతో కూలీ పనులకు వెళ్లలేక, పిల్లల చదువు సాగడం లేదని పట్టాలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పార్టీ ఖమ్మం, భ ద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధుసూదన్‌, రేగా కాంతారావు, నేతలు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, శంబిపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్‌, లింగాల కమల్‌రాజ్‌, కూరాకుల నాగభూషణంతో పాటు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో 900 కుటుంబాలు ఉంటున్న స్థలంపై జిల్లాలోని ముగ్గురు మంత్రుల కన్ను పడిందని కేటీఆర్‌ విమర్శించారు. తమ హయాంలో పేదలకు చెడు చేయకపోగా కరెంట్‌, నీళ్లు ఇచ్చామని, 400 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమిని కూడా కాపాడి పార్క్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం రోజు కేసీఆర్‌ 4లక్షల మందితో మీటింగ్‌ పెట్టినా ఎవరికీ హాని జరగలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం చుట్టూ వంద ఎకరాల కొన్నవారు, ఈ స్థలంపై కన్నేసిన వారే మాఫియాగా మారారని ఆగ్రహ ం వ్యక్తం చేశారు. పేదల అవస్థలు చూసి కేసీఆర్‌ తమను పంపించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement