కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

కలెక్

కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా

● ఉదయం ఉత్తర్వులు, సాయంత్రం బాధ్యతల స్వీకరణ ● టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా బదిలీ అయిన జితేష్‌ వి పాటిల్‌

రైతు పక్షపాతిగా పేరొందిన పాటిల్‌

● ఉదయం ఉత్తర్వులు, సాయంత్రం బాధ్యతల స్వీకరణ ● టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా బదిలీ అయిన జితేష్‌ వి పాటిల్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ సీఎండీగా నియమితులయ్యారు. కాగా, అంకిత్‌ సక్సేనాకు జితేష్‌ వి పాటిల్‌తో పాటు అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌.. వేదపండితుల మత్రోచ్ఛరణల నడుమ స్వాగతం పలికారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి 8 – 8.30 గంటల మధ్యలో అంకిత్‌ సక్సేనా బాధ్యతలు స్వీకరిస్తారని జిల్లా అధికారులకు ముందుగా సమాచారం అందినా.. రెండు గంటల ముందుగానే ఆయన కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆర్డీఓ మధు అక్కడ స్వాగతం పలికి కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో సమావేశమై జిల్లా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించే విషయం మీడియాకు సమాచారం అందించకపోవడం గమనార్హం.

నిజామాబాద్‌లో అదనపు కలెక్టర్‌గా..

2019 తెలంగాణ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన అంకిత్‌ సక్సేనా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మొదట ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. తన అకడమిక్‌ కెరీర్‌లో టాపర్‌గా నిలిచారు. ముస్సోరి లోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పూర్తి చేశారు. తర్వాత వివిధ జిల్లాలో సహాయ కలెక్టర్‌గా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీలో భాగంగా జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

జిల్లా కలెక్టర్‌గా 2024 జూన్‌ 15న బాధ్యతలు స్వీకరించిన జితేష్‌ వి పాటిల్‌ పరిపాలనలో తనదైన మార్క్‌ చూపించారు. రైతుబిడ్డగా ఐఏఐస్‌ స్థాయికి ఎదిగిన ఆయన.. రైతుల పక్షపాతిగా పేరుగాంచారు. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడితో పాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందంటూ అవగాహన కల్పించారు. బయోచార్‌, మునగ సాగు, కౌజు పిట్టల పెంపకం, మేకపాల ప్రాముఖ్యత, అజోల్లా, మట్టి ఇటుకల వాడకం, యువతకు ఫర్నిచర్‌ తయారీలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేశారు. పరిపాలనలో పారదర్శకత, జిల్లాలో సుడిగాలి పర్యటనలతో అన్ని వర్గాల వారి ప్రశంసలు అందుకున్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి సంపూర్ణ అభియాన్‌ అవార్డు, నేషనల్‌ జియోస్పేషియల్‌ ప్రాక్టీషనర్‌ అవార్డు, జల్‌సంచయ్‌–జల్‌ భాగీదారీ అవార్డులు సాధించారు. అయితే ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై మాత్రం కొంత నిర్లక్ష్యం వహించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో గురువారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీగా వెళ్తున్నారు.

కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా1
1/1

కలెక్టర్‌గా అంకిత్‌ సక్సేనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement