దారుణ హత్య
మద్యం మత్తులో కత్తులు,
స్క్రూ డ్రైవర్లతో దాడి
గొడవను ఆపబోయిన వ్యక్తిని
హతమార్చిన యువకులు
100కు, స్థానిక పోలీసులకు
ఫోన్ చేసినా స్పందించని వైనం
భద్రాచలంటౌన్: మద్యం మత్తులో యువకులు గ్యాంగ్‌వార్‌కు తలపడ్డారు. గొడవను నిలువరించబోయిన వ్యక్తిని కత్తులు, స్క్రూ డ్రైవర్లతో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన భద్రాచలంలో బుధవారం జరిగింది. సరిహద్దు ప్రాంతమైన ఎటపాక వైన్ షాపు వద్ద రెండు బైక్‌లు స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటన ఘర్షణకు దారితీయగా, మద్యం మత్తులో ఉన్న రాజుపేట కాలనీకి చెందిన ఇరువర్గాల యువకులు చర్ల రోడ్డులోని మరో వైన్ షాపు వద్దకు చేరుకుని గొడవకు దిగారు. సుమారు రెండు గంటలపాటు ప్రధాన రహదారిపై కత్తులు, స్క్రూడ్రైవర్లతో హల్‌చల్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.
బంధువులను చూసేందుకు వచ్చి..
పాల్వంచ ఒడ్డుగూడేనికి చెందిన సజ్జ రవి(38) జామాయిల్ కలపను ఐటీసీకి విక్రయించే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భద్రాచలం రాజుపేట కాలనీలో ఉన్న బంధువులు అనారోగ్యంతో బాధపడుతుంటే చూసేందుకు వచ్చాడు. వైన్స్ షాపు వద్ద యువకుల మధ్య జరగడం, గొడవలో బంధువులు కూడా ఉండటంతో ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు రవిపైనే దాడి చేశారు. కత్తులు, స్క్రూడ్రైవర్లతో విచక్షణారహితంగా పొడవడంతో రవి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఛాతిలో పోడవడంతో గుండెకు గాయమై అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య జయశ్రీ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆస్పత్రిలో తండ్రి మృతదేహం వద్ద పసిపిల్లలు ఏడుస్తున్న తీరు అందరినీ కదిలించింది. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం
ఘర్షణ జరుగుతున్న సమయంలో స్థానికులు డయల్ 100కు, స్థానిక పోలీసులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవ రూ స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం 4 నుంచి 6 వరకు సుమారు రెండు గంటలపాటు దుండగులు నడిరోడ్డుపై వీరంగం చేసిన పోలీసులు రాకపోవడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు గ్యాంగ్‌వార్ జరగ్గా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మద్యం, గంజాయి మత్తులో యువత హత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా పోలీస్ అధికారులు మేల్కోని చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
భద్రాచలంలో
గ్యాంగ్‌వార్ కలకలం
దారుణ హత్య


