 
															ఏజెన్సీ ఆస్పత్రికి సుస్తీ
సమస్యలకు నిలయం
భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో అందని వైద్యసేవలు 69 డాక్టర్ పోస్టులకు 34 మందే విధినిర్వహణ 143 మంది సిబ్బందికి ప్రస్తుతం ఉన్నది 66 మంది మరమ్మతులకు నోచుకోని కిటీకీలు, తలుపులు
విభాగాల వారీగా వైద్యుల ఖాళీలు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. భవనాలు మరమ్మతులు నోచుకోవడంలేదు. దీంతో ఏజెన్సీ ప్రజలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడంలేదు. 100 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రిని 2018లో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. నూతన భవనాలు నిర్మించారు. అధునాతన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడకు భద్రాచలం ఏజెన్సీ, మణుగూరు, పాల్వంచ ప్రాంతాలతోపాటు సరిహద్దు ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కూడా చికిత్స కోసం వస్తుంటారు. కానీ సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందటం లేదు.
112 పోస్టులు ఖాళీ..
ఆస్పత్రిలో 212 మంది వైద్యులు, సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 100 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 69 వైద్య పోస్టులుండగా, ప్రస్తుతం కాంట్రాక్ట్, రెగ్యులర్ కలిపి 34 మందే పనిచేస్తున్నారు. సిబ్బంది 143 మంది పోస్టులు ఉండగా, 66 మంది పనిచేస్తున్నారు. వారిలో రెగ్యులర్ 50, ఔట్‌సోర్సింగ్ 16 మంది ఉన్నారు. 20 మందికి పైగా ఇతర ఆస్పత్రుల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. నలుగురు మాత్రం ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చి ఇక్కడ డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్న వైద్యులు కూడా సమయపాలన పాటించడంలేదని, విధులకు ఆలస్యంగా వస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
న్యూరో, కార్డియాలజీ వైద్యులు లేరు
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నిత్యం అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భిణులకు స్కానింగ్ సేవలు అందించాల్సి ఉంటుంది. రేడియాలజీ విభాగంలో ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. న్యూరోసర్జన్, కార్డియాలజిస్ట్, ఎముకల వైద్య నిపుణులు ఒక్కరూ లేరు. దీంతో ఆయా సమస్యలపై వచ్చే బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తోంది. ఫలితంగా రూ. వేలు, రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అరకొరగా సివిల్ సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లు
సివిల్ సర్జన్లు 16 పోస్టులు ఉండగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 37 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 29 మంది ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 మందిలో 21 మంది ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో కేవలం 8 మంది మాత్రమే విధులు నిర్వరిస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందడంలేదు.
స్టాఫ్ నర్సుల్లో 40 పోస్టులు ఖాళీ
స్టాఫ్ నర్సుల్లో 53 పోస్టులకు 13 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. మిగిలిన 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ నర్సులలో కూడా 9 పోస్టులకు 9 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కానీ వీరిలో కొందరు డిప్యూటేషన్‌పై ఇతర ఆస్పత్రుల్లో విధులు నిర్వరిస్తున్నారు. కొందరు నర్సింగ్ సిబ్బంది భద్రాచలం ఆస్పత్రిలో విధి నిర్వహణకు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పట్టించుకోని ఉమ్మడి జిల్లా మంత్రులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు ఒక్కరూ ఆస్పత్రిని సందర్శించి, సమస్యలు తెలుసుకోలేదు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ పలుమార్లు సందర్శించి ఆస్పత్రి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ గతేడాది ఆగస్టు 8న ఆస్పత్రిని సందర్శించి వైద్య నిపుణుల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మినీ టీ–హబ్, డ్రగ్ స్టోర్ కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.
ఆస్పత్రి, పరిసరాలు సమస్యలకు నిలయంగా మారాయి. భవనంలో డోర్లు చెదలు పట్టి పాడైపోయాయి. పుచ్చిపోయిన గుమ్మాలు, వేలాడుతున్న కిటీకీలు, పడిపోయిన స్టీల్ రైలింగ్, పెచ్చులూడుతున్న కిటికీలు బాధితులను కలవరపెడుతున్నాయి. కాగా ఆస్పత్రి గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన పలు అసెస్మెంట్లలో మొదటి స్థానం దక్కించుకుంది. కానీ ఇందుకు సంబంధించి రూ.30 లక్షల నగదు ఆస్పత్రికి అందలేదు. దీంతో మరమ్మతులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి అభివృద్ధికి కూడా నిధుల కొరత వెంటాడుతోంది.
వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
పోస్టులు ఉన్నది ఖాళీలు
సివిల్ సర్జన్ 16 3 13
సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ 1 0 1
డిప్యూటీ సివిల్ సర్జన్ 9 1 8
డెంటల్ సివిల్ సర్జన్ 1 0 1
డిప్యూటీ డెంటల్ సర్జన్ 1 0 1
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 37 8 29
ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ 1 0 1
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 3 1 2
డెర్మటాలజీ 1 0 1
ఏరియా ఆసుపత్రిలో గల వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బంది కొరత ఉంది, అదే విధంగా ఏరియా ఆసుపత్రి భవనం, డోర్లు, కిటీకీలు, గుమ్మాలకు మరమ్మత్తులకు సంబంధించి అవార్డులకు రావాల్సిన నగదు వస్తే చేయిస్తాము, లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాము.
– డాక్టర్ రామకృష్ణ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
 
							ఏజెన్సీ ఆస్పత్రికి సుస్తీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
