 
															ముడిపడని ముహూర్తం
చర్ల మినహా అంతటా..
● రక్తనిల్వ కేంద్రం ప్రారంభం ఎప్పుడో..? ● పరికరాలు, అనుమతులు ఉన్నా ఉపయోగం సున్నా ● మణుగూరు, అశ్వారావుపేటలో ప్రారంభం.. ఇల్లెందులో తప్పని ఎదురుచూపులు 
ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రానికి పరికరాలు, గది, సిబ్బంది సిద్ధంగా ఉన్నా ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.12 లక్షల చొప్పున వెచ్చించి రెండు నెలల క్రితమే పరికరాలు పంపిణీ చేశారు. మిగితా రెండు ఆస్పత్రుల్లో ఇప్పటికే సేవలు కొనసాగుతున్నా.. ఇల్లెందులో మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.
దాతల నుంచి సేకరణ..
దాతల నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించి, ఈ కేంద్రంలో నిల్వ చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం చాలా అవసరం. శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి ఆపరేషన్ల వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే రక్తం అందుబాటులో ఉండాలి. ఈ కేంద్రాల్లో దాతలు అందించిన రక్తంలో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ వంటివి వేరు చేసి విడివిడిగా నిల్వ చేస్తారు. తద్వారా ఆయా అవరాలకు గల వారికి సకాలంలో రక్తం అందడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
అందుబాటులో పరికరాలు..
ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఇప్పటికే రక్త నిల్వ పరికరాలు చేరాయి. వీటితో పాటు సిరంజీలు, సేకరణ సంచులు, కుర్చీలు, టేబుళ్లు, లేబులింగ్, ట్రాకింగ్ సిస్టమ్స్, ఫ్రీజర్, ల్యాబ్ మెటీరియల్, స్టెరిలైజేషన్ పరికరాలు, కంప్యూటర్ వంటివి సిద్ధంగా ఉన్నాయి. పూర్తి ఏజెన్సీ ప్రాంత వాసులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వారిలో రక్తహీనతతో బాధపడే గర్భిణులు అధికంగా ఉంటారు. ఇక కిడ్నీ, లివర్ తదితర బాధితులకు కూడా ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు.
జిల్లాలోని మూడు ఆస్పత్రులకు రక్త నిల్వ కేంద్రాలు మంజూరు కాగా మణుగూరు, అశ్వారావుపేటలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇల్లెందులో కూడా మెటీరియల్, స్టాఫ్, ఫ్రీజర్‌లు, కంప్యూటర్ సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్‌ఎస్
జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచలో ఇప్పటికే రక్త నిధి కేంద్రాలు ఉండగా, మణుగూరు, అశ్వారావుపేటలో ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇల్లెందులో కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రధాన సెంటర్లన్నింటిలోనూ రక్త నిల్వలు అందుబాటులోకి రానున్నాయి.
 
							ముడిపడని ముహూర్తం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
