 
															సమీకృత సాగుపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
తుపానుతో నష్టపోయిన పంటల పరిశీలన
టేకులపల్లి : సమీకృత వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని తొమ్మిదోమైలు తండా, తంగెళ్లతండాలో తుపానుతో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పొలాల్లో నీరు నిల్వ ఉంటే మరింతగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున నీటిని తొలగించాలని చెప్పారు. పత్తి సాగు చేస్తున్న రైతులు ఆ తర్వాత మునగ సాగుపై దృష్టి సారించాలని కోరారు. మునగ సాగుతో ఇప్పటికే జిల్లాలో చాలా మంది రైతులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మునగ సాగుతో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. వరి సాగు చేసే రైతులు, నీటి ఆధారం ఉన్నవారు ఆయిల్ పామ్ సాగు చేయాలని, తద్వారా దీర్ఘకాలికంగా లాభాలు గడించవచ్చని తెలిపారు. పంటలతో పాటు కౌజు పిట్టలు, మేకలు, గేదెలు, చేపల పెంపకం చేపట్టాలని, కూరగాయలు సాగు చేయాలని, దీంతో రైతుల ఆదాయం మరింతగా పెరుగుతుందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఏడీఏ లాల్‌చంద్, ఏఓ అన్నపూర్ణ, ఏఈఓ రమేష్ తదితరులు ఉన్నారు.
సహాయక చర్యలు చేపడుతున్నాం..
సూపర్‌బజార్(కొత్తగూడెం): తుపాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాల్లో తీసుకోవాల్సిన భద్రతా, సహాయ చర్యలపై హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీకి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. వీసీలో ఎస్పీ రోహిత్‌రాజ్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీఏఓ బాబూరావు, డీసీఎస్‌ఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
ఫర్నిచర్ అసిస్టెంట్ కోర్సులో
మూడు నెలల శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఫర్నిచర్ అసిస్టెంట్‌గా ఆసక్తి ఉన్న వారికి రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికకు నవంబర్ 6న కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టాలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో స్థిరమైన ఉపాధి ఉంటుందని, మొదటి విడతలో ఎనిమిది మంది శిక్షణ పూర్తి చేసి రూ.15వేల వేతనంతో అప్రెంటిస్ చేస్తున్నారని తెలిపారు. రెండో విడతలో 20 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుండగా ఆసక్తి ఉన్న వారు గూగుల్ ఫాం లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత, 18 – 30 ఏళ్ల వయస్సు, ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https:// tinyurl. com/4zv2bn67 గూగుల్ ఫాం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 79958 06182, 77994 70817 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
