కమనీయంగా కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయంగా కల్యాణం

Oct 31 2025 7:55 AM | Updated on Oct 31 2025 7:55 AM

కమనీయంగా కల్యాణం

కమనీయంగా కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్‌.రజనీకుమారి, కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

కొనసాగుతున్న క్రీడా పోటీలు

పాల్వంచ: కేటీపీఎస్‌ 7వ దశ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్‌ క్రీడా పోటీలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. పోటీల్లో శ్రీశైలం, నాగర్జునసాగర్‌, పోచంపాడు, విద్యుత్‌ సౌధ, బీటీపీఎస్‌, కేటీపీఎస్‌ టీమ్‌లు పాల్గొన్నాయి. టేబుల్‌ టెన్నీస్‌లో విన్నర్‌గా విద్యుత్‌ సౌధ, రన్నర్‌ 7వ దశ, ఓపెన్‌ డబుల్స్‌ విన్నర్‌ విద్యుత్‌ సౌధ, రన్నర్‌గా కేటీపీఎస్‌ 7వ దశ, క్యారమ్స్‌లో విద్యుత సౌధ విన్నర్‌, 7వ దశ రన్నర్‌, షటిల్‌ టీం ఈవెంట్‌లో విద్యుత్‌సౌధ విన్నర్‌, కేటీపీఎస్‌ 7వ దశ రన్నర్‌గా నిలిచాయి. మిగితా పోటీలు శుక్రవారం ముగియనున్నాయి. స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ లోహిత్‌ ఆనంద్‌, కౌన్సిల్‌ సెక్రటరీలు మహేష్‌, వీరస్వామి, నరసింహారావు పాల్గొన్నారు.

కిన్నెరసానికి

విదేశీ పర్యాటకులు

పాల్వంచరూరల్‌ : మండలంలోని కిన్నెరసానిని గురువారం విదేశీ పర్యాటకులు సందర్శించారు. జర్మనీ దేశస్తులు సందర్శించి డీర్‌పార్కులోని దుప్పులను, జలాశయాన్ని వీక్షించి ఆ తర్వాత బోటు షికారు చేశారు.

అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలి

మణుగూరు రూరల్‌ : అవినీతి రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న పిలుపునిచ్చారు. థర్మల్‌ కేంద్రంలో గురువారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ఉద్యోగలంతా నిజాయితీగా పని చేస్తూ దేశం, సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. సాంబాయిగూడెం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు సూర్యనారాయణ, పార్వతి, డీవైసీసీ శ్రీనివాస్‌, విజిలెన్స్‌ డీఎస్పీ రమేష్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ తిరుపతి, సేఫ్టీ డీఈ ఆనందప్రసాద్‌, ఏడీఈలు రమణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

‘ఓపెన్‌’ ఫలితాలు విడుదల

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో గత నెల 22 నుంచి 28 వరకు జరిగిన ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. ఇంటర్‌లో 289 మందికి గానూ 141 మంది, పదో తరగతిలో 280 మందికి 52 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాల వివరాలను వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని, 25 రోజుల్లో మార్కుల మెమోలు స్టడీ సెంటర్లకు చేరుతాయని తెలిపారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు నవంబర్‌ 4 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రీకౌంటింగ్‌ ఇంటర్‌కు రూ.400, పదో తరగతికి రూ.350, రీ వెరిఫికేషన్‌ ఇంటర్‌కు రూ.1,200, పదో తరగతికి రూ.1,200 చెల్లించాలని, వివరాలకు స్టడీ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement